ఆ ఆత్మహత్యలు నన్ను ఎంతగానో కలచివేశాయి: ‘సూపర్ 30’ ఆనంద్‌ కుమార్‌

రాజస్థాన్‌లోని కోటా(Kota)లో చోటుచేసుకుంటున్న వరుస ఆత్మహత్యలపై సూపర్ 30 కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు ఆనంద్‌ కుమార్(Anand Kumar) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఓ సూచన చేశారు. 

Updated : 29 Aug 2023 14:50 IST

దిల్లీ: పోటీ పరీక్షల కోచింగ్‌ హబ్‌గా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌( Rajasthan)లోని కోటా(Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజినీర్లుగా తమ వృత్తి జీవితంలో ఎదగాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు.. కోటాలో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇదే తరహాలో ఆదివారం ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనిపై సూపర్ 30 కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు ఆనంద్‌ కుమార్(Super 30 Founder Anand Kumar) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మరణాల గురించి విన్న ఆయన చలించిపోయారు.

‘నాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. కోచింగ్ కేంద్రాల నిర్వాహకులు విద్యను ఆదాయవనరుగా మాత్రమే చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి విద్యార్థిని మీ బిడ్డలా భావించి శ్రద్ధ వహించాలని కోరుతున్నాను. అలాగే ఏ ఒక్క పరీక్ష మనలోని ప్రతిభను నిర్ణయించదని విద్యార్థులకు వివరించాలి. జీవితంలో విజయం సాధించడానికి ఎన్నో మార్గాలుంటాయి. అలాగే తల్లిదండ్రులకో విజ్ఞప్తి.. మీరు సాధించలేని కలల్ని మీ పిల్లలపై రుద్దాలని చూడొద్దు’ అని ఆనంద్‌ కుమార్‌(Anand Kumar) సూచించారు. 

ఆదివారం మధ్యాహ్నం తాను కోచింగ్‌ తీసుకుంటున్న భవనం ఆరో అంతస్తు నుంచి మహారాష్ట్రకు చెందిన అవిష్కర్‌ శంభాజీ కస్లే (17) అనే విద్యార్థి దూకేయగా.. సాయంత్రం బిహార్‌కు చెందిన ఆదర్శ్‌ రాజ్‌ (18) అనే మరో విద్యార్థి అద్దె గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అవిష్కర్‌ ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు వసతి గృహం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ బలవన్మరణాలు ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. 

వివిధ ఎంట్రెన్స్‌ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’(Kota)లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 22కి చేరడం గమనార్హం. ఒత్తిడే ఈ ఆత్మహత్యలకు దారితీస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. 

ఆదివారం ఘటనలతో రెండు నెలలపాటు కోటాలోని శిక్షణా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి టెస్టులు నిర్వహించకూడదని స్థానిక యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సెప్టెంబరు, అక్టోబరులో విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

స్పందించిన ఆనంద్‌ మహీంద్రా..

ఈ ఏడాది కోటాలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ ఆత్మహత్యలపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) స్పందించారు. ‘ఈ బలవన్మరణాల వార్తలు నన్ను ఎంతగానో కలచివేస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం తీవ్రంగా బాధిస్తోంది. ఇక్కడ విద్యార్థులందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ వయస్సులో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం గురించి కాకుండా మీ గురించి మీరు తెలుసుకునేలా మీ లక్ష్యం ఉండాలి. పరీక్షల్లో విజయం సాధించకపోవడమనేది కేవలం మీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. దానర్థం మీ అసలైన ప్రతిభ వేరేగా ఉందని. దానికోసం వెతకండి. అప్పుడే మిమ్మల్ని మీరు కొత్తగా కనుగొంటారు’ అని విద్యార్థులకు సూచన చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని