ముందు రాయ్‌బరేలీలో గెలవండి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదట రాయ్‌బరేలీలో గెలవాలంటూ చెస్‌ దిగ్గజం కాస్పరోవ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Published : 05 May 2024 04:48 IST

రాహుల్‌పై చెస్‌ దిగ్గజం వ్యాఖ్య
ఆ తర్వాత వివరణ ఇచ్చిన కాస్పరోవ్‌

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదట రాయ్‌బరేలీలో గెలవాలంటూ చెస్‌ దిగ్గజం కాస్పరోవ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమనడంతో తన వ్యాఖ్యల ఉద్దేశం వేరంటూ కాస్పరోవ్‌ వివరణ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వెళుతూ రాహుల్‌ గాంధీ తన ఫోన్‌లో చెస్‌ ఆడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. తన అభిమాన చదరంగ ఆటగాడు గ్యారీ కాస్పరోవ్‌ అని, రాజకీయాలకు, చెస్‌కు దగ్గరి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చదరంగ ఆటగాడినని చెప్పారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా ఓ నెటిజన్‌ వ్యంగ్యంగా స్పందించారు. కాస్పరోవ్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆటకు త్వరగా గుడ్‌బై చెప్పడం వల్ల వారికి మన కాలంలోని గొప్ప మేధావిని ఎదుర్కొనే అవకాశం రాలేదని, ఇది తనకు రిలీఫ్‌గా ఉందని పేర్కొన్నారు. దీనిపై నటుడు రణవీర్‌ షోరే కూడా పోస్ట్‌ చేయగా.. కాస్పరోవ్‌ స్పందించారు.

రాహుల్‌ గాంధీ చెస్‌లో అగ్రస్థానానికి పోటీపడే ముందు మొదట రాయ్‌బరేలీలో గెలవాలని గ్యారీ కాస్పరోవ్‌ వ్యాఖ్యానించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం, కాంగ్రెస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాస్పరోవ్‌ మరో పోస్ట్‌ పెట్టారు. భారత రాజకీయాలను తన చిన్న జోక్‌ ప్రభావితం చేయదని ఆశిస్తున్నానని, తనకు నచ్చిన చెస్‌ ఆటను రాజకీయ నాయకుడు ఆడటం చూడకుండా ఉండలేనని అన్నారు. అటువంటి రాజకీయ నాయకులను చమత్కరించడం తనకు ఎంతో ఇష్టమైన ఆటగా కాస్పరోవ్‌ అభివర్ణించారు. రష్యా అధినేత పుతిన్‌పైనా కాస్పరోవ్‌ ఇలాంటి సున్నితమైన విమర్శలు చేసేవారు. భారత రాజకీయాల్లో తాను చేసిన జోక్‌ అందరికీ అర్థం కాలేదని భావిస్తున్నట్లు కూడా కాస్పరోవ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని