Chandrayaan-3: చంద్రయాన్‌-3 నుంచి విడిపోయిన ‘విక్రమ్‌’.. కీలక ఘట్టం పూర్తి

Chandrayaan-3: చంద్రయాన్‌-3 నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా విడిపోయింది. ఇక నుంచి ఇది సొంతంగా జాబిల్లి చుట్టూ తిరగనుంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న చందమామపై అడుగుపెట్టనుంది.

Updated : 17 Aug 2023 16:09 IST

బెంగళూరు: జాబిల్లి (Moon)పై అడుగుపెట్టడమే లక్ష్యంగా రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 (Chandrayaan-3) మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. గురువారం ఈ వ్యోమనౌకలోని ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ ‘విక్రమ్‌ (Vikram)’ విజయవంతంగా విడిపోయింది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది సిద్ధమైంది.

ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన తర్వాత ల్యాండ్‌ మాడ్యూల్‌ పంపిన సందేశాన్ని బెంగళూరులోని ఐఎస్‌టీఆర్‌ఏసీ కేంద్రం అందుకొంది. ‘‘థ్యాంక్స్‌ ఫర్‌ ది రైడ్‌, మేట్’ అని ల్యాండర్‌ మెసేజ్‌ పంపినట్లు ఇస్రో ట్విటర్‌లో ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తవడంతో ఇక నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ జాబిల్లిని సొంతంగా చుట్టేస్తుంది. శుక్రవారం (ఆగస్టు 18) సాయంత్రం 4 గంటలకు డీ-అర్బిట్‌-1 ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. ఆ తర్వాత 20న మరోసారి డీ-ఆర్బిట్‌-2 ప్రక్రియ చేపడుతారు.

చంద్రుడిని చేరాలంటే.. 40 రోజులు ఎందుకు పడుతోంది..?

ఈ ప్రక్రియలతో ల్యాండర్‌ వేగాన్ని క్రమంగా తగ్గిస్తారు. ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగేలా నిర్దేశించారు. జాబిల్లిని తాకే సమయంలో ల్యాండర్‌ నిలువు వేగం సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్‌ వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూసుకోనున్నారు. మరోవైపు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ప్రస్తుత కక్ష్యలోనే కొన్ని నెలలు/సంవత్సరాల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించనుందని ఇస్రో వెల్లడించింది.

‘చంద్రయాన్‌-3 (Chandrayaan-3)’ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా ఇస్రో (ISRO) విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పొడిగించారు. 5వ భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ జాబిల్లికి చేరువ చేశారు. బుధవారమే చంద్రయాన్‌-3 చివరి దశ కక్ష్యలోకి ప్రవేశించగా.. నేడు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయింది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటల సమయంలో ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో (ISRO) వెల్లడించింది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని