Ukraine crisis: ఉక్రెయిన్‌లో భారత పౌరులు.. కేంద్రం కీలక నిర్ణయం

ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొని ఉండటంతో.. అక్కడ ఉన్న భారత పౌరులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది.

Published : 18 Feb 2022 01:28 IST

వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు

దిల్లీ: ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొని ఉండటంతో.. అక్కడ ఉన్న భారత పౌరులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎయిర్ బబుల్ ద్వారా భారత్‌ నుంచి ఉక్రెయిన్‌కు రాకపోకలు సాగించే విమానాలపై పరిమితిని తొలగించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన చేసింది.

‘కేంద్ర పౌర విమానయాన శాఖ ఎయిర్ బబుల్ కింద భారత్‌, ఉక్రెయిన్ మధ్య నడిపే విమానాలు, సీట్ల సంఖ్యపై పరిమితిని తొలగించింది. ఎన్ని విమానాలు, ఛార్టర్డ్‌ ఫ్లైట్స్ అయినా నడపవచ్చు. డిమాండ్‌కు తగినట్లుగా విమానాల సంఖ్యను పెంచాలని విమానయాన సంస్థలకు వెల్లడించాం. ఈ విషయంలో విమానయాన శాఖ, విదేశాంగ శాఖ సమన్వయం చేసుకుంటున్నాయి’ అని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తగిన విమానాలు అందుబాటులో లేవని వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో.. డిమాండ్‌కు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం వెల్లడించింది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న విమానాల్లో టికెట్లు బుక్ చేసుకొని వెంటనే స్వదేశానికి బయల్దేరాలని సూచించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రికత్తలు తీవ్రస్థాయికి చేరడంతో.. అక్కడ ఉండటం తప్పనిసరి కాని విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లే అవకాశాలను పరిశీలించాలని రాయబార కార్యాలయం మంగళవారం సూచించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో దాదాపు 18 వేల మంది భారత విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి ఎప్పటికప్పుడు సహకరించేందుకు విదేశాంగ శాఖ దిల్లీలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని