Updated : 01 Apr 2022 18:51 IST

ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చెలాయించాలని చూడకూడదు: జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

దిల్లీ: పోలీసు విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదని.. పోలీసు అధికారాలను రాజకీయ నాయకులు దుర్వినియోగం చేయడం ఎప్పటినుంచో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్‌ డి.పి.కోహ్లీ 19వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ‘‘ప్రజాస్వామ్యం - దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు’’ అంశంపై జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రసంగించారు. పోలీసుల జీవితాలపై ప్రముఖ కవి రావి శాస్త్రి రచనను సీజేఐ ఉటంకించారు. పోలీసు ఉద్యోగం ఎంత సవాళ్లతో కూడుకున్నదో రావిశాస్త్రి తన రచనల్లో కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. అందరి విషయంలో చట్టం సమానంగా అమలు చేయడం పోలీసుల విధి అన్నారు. బాధితులకు న్యాయం అందించడంలో చట్టం అమలు అంతర్భాగమని సీజేఐ పేర్కొన్నారు.

‘‘ఇది 75 ఏళ్ల స్వతంత్ర భారత సందర్భం. భారతీయులందరం మన స్వేచ్ఛను మనం ప్రేమిస్తాం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనే మన స్వేచ్ఛ ఉంటుంది. రాజ్యాంగం చెప్పిన ప్రజాస్వామ్య విధానం కంటే ఎవరూ ఎక్కువ కాదు. ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరూ చూడకూడదు. నేరాల నిరోధానికి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. ప్రజల నమ్మకాన్ని చూరగొనడమే పోలీసుల తక్షణ కర్తవ్యం. ఆరంభ దశల్లో సీబీఐపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండేది. నిష్పాక్షికత, స్వతంత్రత విషయంలో సీబీఐ ప్రతీకగా నిలిచేది. న్యాయం కోసం బాధితులు సీబీఐ వైపే చూసేవారు. కాలక్రమంలో తన చర్యల ద్వారా సీబీఐ చర్చల్లో నిలిచింది. విలువలు, నైతికతకు కట్టుబడి ఉంటే ఎవరూ మిమ్మల్ని అడ్డగించలేరు. మంచి నాయకుడు ఉంటే ఆ సంస్థకు మంచి పేరు తీసుకురావచ్చు’’

‘‘ప్రస్తుతం సీబీఐ తన పని తాను చేసుకుపోతోంది. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటుంది. పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడం, స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థల ఏర్పాటు అత్యవసరం. ప్రతి దర్యాప్తు సంస్థ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. అన్ని దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ ఉండాలి. ప్రాసిక్యూషన్‌, దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలి. ఏటా దర్యాప్తు సంస్థల పనితీరును మదింపు చేయాలి. శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాలోని అంశం. చాలా వరకు నేర విచారణ రాష్ట్రాల పరిధిలోనే జరుగుతుంది. విశ్వసనీయతలో జాతీయ సంస్థల కంటే పోలీసులు వెనకబడుతున్నారు. రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అత్యవసరం. ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు మెరుగుపడాలి. అందుకోసం పోలీసుల శిక్షణ తీరులో మార్పు రావాలి. నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. దర్యాప్తు సంస్థలే శాశ్వతం’’ అని సీజేఐ పేర్కొన్నారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని