ట్రంప్‌ వాడిన ఔషధానికి భారత్‌లో గ్రీన్‌సిగ్నల్‌!

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నికల సమయంలో కరోనా బారిన పడటనంతో ఒక యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని వాడారు. ఆ తర్వాత ఆయన వేగంగా కోలుకొన్నారు. తాజాగా ఇప్పుడు ఆ ఔషదం భారత్‌లో అందుబాటులోకి రానుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఔషధ తయారీ

Updated : 09 May 2021 11:17 IST

త్వరలో అందుబాటులోకి యాంటీబాడీ కాక్‌టెయిల్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నికల సమయంలో కరోనా బారిన పడటంతో ఒక యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని వాడారు. ఆ తర్వాత ఆయన వేగంగా కోలుకున్నారు. తాజాగా ఇప్పుడు ఆ ఔషధం భారత్‌లో అందుబాటులోకి రానుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ రోచ్‌కు  భారత్‌లోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి అనుమతులు లభించాయి. ప్రస్తుతానికి  దీన్ని దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. సిప్లా కంపెనీ భారత్‌లో దీని మార్కెటింగ్‌, పంపిణీ వ్యవహారాలను  చూడనుంది.  రెండు రకాల యాంటీబాడీలను అమెరికాకు రీజనరాన్‌ సంస్థతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తోంది.

యాంటీబాడీ డ్రగ్స్‌ ఎలా పనిచేస్తాయి...

ఏదైనా వ్యాధి సోకినప్పుడు దాన్నుంచి రక్షించేందుకు రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే ప్రోటీన్లే యాంటీబాడీలు.  టీకా ఇచ్చినప్పుడు లేదా సహజంగా వ్యాధి సోకినప్పుడు యాంటీబాడీలు విడుదల కావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అదే, తాజా డ్రగ్‌లో ప్రయోగశాలల్లో లేదా జంతువులపై జరిపిన ప్రయోగాల్లో కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేసిన యాంటీబాడీలను వినియోగిస్తున్నారు. ఇవి నేరుగా శరీరంలోకి ఎక్కించడం ద్వారా వైరస్‌పై తక్షణమే ప్రభావం చూపుతాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

ఏమిటీ కాక్‌టెయిల్‌..!

కొవిడ్‌ వైరస్‌ను ఎదుర్కొనే కాసిరివి మాబ్‌, ఇమ్డివిమాబ్‌ను కలిపి ఈ  ఔషధాన్ని అభివృద్ధి చేశారు. అత్యధిక రిస్క్‌లో ఉన్న తక్కువ నుంచి ఓ మోస్తరు లక్షణాలున్న పేషెంట్లలో దీనిని వినియోగిస్తారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన  ఈ రెండు ప్రతినిరోధకాలను మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ అంటారు. ఇవి మన ఇమ్యూన్‌ వ్యవస్థను అనుకరిస్తూ హానికారక వైరస్‌ల పనిపడతాయి. ఇక సార్స్‌ కోవ్‌-2లోని స్పైక్‌  ప్రోటీన్‌పై పనిచేయడం వీటి ప్రత్యేకత. ఈ ప్రొటీన్‌ను అడ్డుకొంటే వైరస్‌ శరీరంలోని ఏసీఈ2 కణాలకు అతుక్కోదు. ఈ రెండు యాంటీబాడీలు కలిసి స్పైక్‌ ప్రొటీన్లో ఒక ప్రత్యేకమైన భాగంపై పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో వైరస్‌లో మ్యుటేషన్లు ఏర్పడినా ఇది పనిచేస్తుంది. దీంతో కొత్త మ్యుటేషన్లను సమర్థంగా అడ్డుకొనే అవకాశం ఉంది.

ఎవరికీ.. ఎలా వాడొచ్చు..?

తక్కువ లక్షణాలు ఉన్న వారికీ.. ఓ మోస్తరు లక్షణాలున్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ ఔషదాన్ని 12 ఏళ్లు దాటిని వారిపై కూడా వినియోగించవచ్చు. ఒక్కో యాంటీబాడీ 600 ఎంజీ చొప్పున ఔషధ సమ్మేళనాన్ని 1200 ఎంజీ వినియోగించాలి. దీనిని చర్మం కింద ఉండే ఒకరకమైన కండరంలో లేదా నరాలకు ఎక్కించవచ్చు. 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చవచ్చు. అంటే సాధారణ రిఫ్రిజిరేటర్లు సరిపోతాయి. గుండె, కిడ్నీ, డయాబెటిక్ వంటి సమస్యలు ఉన్నవారికి దీనిని వాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ప్రభావం ఎంత..?

ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన మూడు ప్రయోగాల్లో ఆస్పత్రుల్లో చేరని 4,567 మంది హైరిస్క్‌ గ్రూప్‌నకు చెందిన కొవిడ్‌-19 రోగులపై ప్రయోగించారు. డమ్మీ ఔషధం (ప్లెసిబో)  ఇచ్చిన వారితో మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ తీసుకొన్న వారిని పోలిస్తే సానుకూల ఫలితం వచ్చింది.  యాంటీబాడీస్ కాక్‌టెయిల్‌ తీసుకొన్న వారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని దాదాపు 70శాతం తగ్గించింది. దీంతోపాటు నాలుగు రోజుల్లో వేగంగా కోలుకొన్నారు.

వ్యాక్సిన్‌, యాంటీబాడీ డ్రగ్స్‌ మధ్య తేడా ఏంటి?

యాంటీబాడీ డ్రగ్స్‌ తక్షణమే వైరస్‌పై పోరాడతాయి. అదే వ్యాక్సిన్‌ రోగనిరోధక శక్తిని మేల్కోలిపి వైరస్‌ను అంతమొందించేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. దీనికి కాస్త సమయం పడుతుంది.  అలాగే యాంటీబాడీ డ్రగ్స్‌ కేవలం వైరస్‌ సోకిన వారికి చికిత్సగా మాత్రమే వినియోగిస్తారు. అదే వ్యాక్సిన్‌ను వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఇస్తారు.

ఎక్కడెక్కడ అనుమతులు వచ్చాయి..

ఈ ఔషధానికి అమెరికా, ఐరోపా సంఘంలో వినియోగానికి అత్యవసర అనుమతులు వచ్చాయి.  అక్కడ అంగీకారానికి పరిగణనలోకి తీసుకున్న డేటా ఆధారంగానే తాజాగా భారత్‌లో అనుమతి మంజూరు చేశారు.  భారత్‌లో దీనిని సిప్లా మార్కెటింగ్‌ చేయనుంది. దిగుమతులు పూర్తి అయ్యాక.. భాగస్వాములతో చర్చించి దీని ధరను నిర్ణయిస్తామని రోచ్‌ ఎండీ  సింప్సన్‌ ఇమ్మానియేల్‌ వెల్లడించారు. అతి త్వరలోనే ఇది భారత్‌లో అందుబాటులోకి వస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని