Covid-19: పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు!

Covid-19: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో జనసమూహాల్లో మాస్కులు ధరించడాన్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి.

Published : 09 Apr 2023 10:51 IST

దిల్లీ: గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 (Covid-19) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు మళ్లీ కొవిడ్‌ నిబంధనల్ని అమల్లోకి తీసుకొస్తున్నాయి.

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గడిచిన వారంలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మహమ్మారి (Covid-19) నివారణ, వైద్య వసతుల సన్నద్ధతపై ఆరా తీశారు. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల సన్నద్ధతను పరిశీలించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్‌ నిర్వహించాలని కోరారు. తాజాగా పెరుగుతున్న కేసుల నివారణను సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ సరఫరా సహా ఇతర అత్యవసర ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. అలాగే వీటిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

కొవిడ్‌ (Covid-19) నాలుగో దశపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాండవీయ ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో వచ్చిన బీఎఫ్‌.7 ఉత్పరివర్తనమే ఇప్పటి వరకు చివరిదని తెలిపారు. తాజాగా ఎక్స్‌బీబీ1.16 సబ్‌ వేరియంట్‌ ద్వారా కేసులు వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, సబ్‌వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కాదని తెలిపారు.

రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాథమిక స్థాయి కొవిడ్‌ (Covid-19) నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

హరియాణా..

జన సమూహాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలని హరియాణా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహమ్మారి వ్యాప్తి నివారణకు ప్రజలు స్వచ్ఛందంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ మార్గదర్శకాలు అమలయ్యేలా జిల్లా, పంచాయతీ యంత్రాంగాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కేరళ..

గర్భిణులు, వయసులో పెద్దవారు, జీవనశైలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మాస్కులు ధరించడాన్ని కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ సంబంధిత మరణాలు 60 ఏళ్లు పైబడినవారు, డయాబెటిస్‌ వంటి జీవనశైలి సమస్యలతో బాధపడుతున్నవారిలోనే అధికంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే తగినంత ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచాలని కోరారు.

ఉత్తర్‌ప్రదేశ్‌..

విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై విమానాశ్రయాల్లో క్షుణ్నంగా తనిఖీలు జరపాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన ప్రతి శాంపిల్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని సూచించింది.

* ఇదే తరహాలో దిల్లీ, పుదుచ్చేరిలోనూ జనసమూహాల్లో మాస్కులు ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. ఆరోగ్య వ్యవస్థల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాయి.

కొత్తగా 5,357 కేసులు..

దేశంలో ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 5,357 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,814కి పెరిగింది. కొత్తగా మరో 11 మంది మహమ్మారి వల్ల మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 5,30,965కు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని