కొవిషీల్డ్‌ టీకా గడువు ఇక 9నెలలు..!

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా గడువును పెంచుతూ భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న టీకా గడువును 6 నుంచి 9 నెలలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Updated : 31 Mar 2021 14:55 IST

అనుమతించిన డీసీజీఐ

దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా గడువును పెంచుతూ భారత ఔషధ నియంత్రణ సంస్థ - డీసీజీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న టీకా గడువును 6 నుంచి 9 నెలలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో టీకా తయారీ తేదీ నుంచి తొమ్మిది నెలలపాటు కొవిషీల్డ్‌ను వినియోగించుకోవచ్చు.

కొవిషీల్డ్‌ టీకా గడువు పెంచుతున్నట్లు తాజాగా డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) భారత్‌లో టీకా తయారు చేస్తోన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌కు లేఖ రాసింది. దీంతో ఇప్పటికే తేదీ ముద్రించని టీకాలపై గడువును తొమ్మిది నెలలుగా ముద్రించుకోవచ్చని డీసీజీఐ వీజీ గోసామి సీరం ఇన్‌స్టిట్యూట్‌కు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముద్రించని టీకా సీసాలతో పాటు మొత్తం టీకా నిల్వ వివరాలను కేంద్ర ఔషధ పరిశోధన సంస్థకు తెలియజేయాలని కోరారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన చాలా టీకాల గడువు(ఎక్స్‌పైరీ) 6నెలలుగా ఉన్నాయి. ప్రాథమికంగా వీటిని ఆరునెలల వరకు వినియోగించుకునేందుకు తయారు చేస్తున్నప్పటికీ నిపుణుల పూర్తి విశ్లేషణ అనంతరం వీటి గడువును పెంచుకునేందుకు తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొవిషీల్డ్‌ ఎక్స్‌పైరీ గడువును 6 నుంచి 9నెలల వరకూ పెంచినట్లు సమాచారం.

ఇదిలాఉంటే, ప్రపంచంలో వ్యాక్సిన్‌ కేంద్రంగా ఉన్న భారత్‌లో సీరం ఇన్‌స్టీట్యూట్‌ ఆఫ్‌ ఇండియా భారీ స్థాయిలో కొవిడ్‌ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. భారత్‌లో వీటిని పంపిణీ చేయడమేకాకుండా ఇతర దేశాలకు సరఫరా చేస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ నేతృత్వంలో ఏర్పాటైన ‘కొవాక్స్‌’ కార్యక్రమంలో భాగంగా పేద, మధ్యఆదాయ దేశాలు సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేస్తోన్న టీకాపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పటివరకు వివిధ కార్యక్రమాల కింద భారత్ 84 దేశాలకు 6.4కోట్ల కరోనా టీకా డోసులను సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్‌ కూడా అనుమతి పొందిన విషయం తెలిసిందే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని