జర్నలిస్టులపై దేశద్రోహం..ఖండించిన ఎడిటర్స్‌ గిల్డ్‌!

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల వార్తలపై కవరేజీ ఇచ్చిన జర్నలిస్టులపై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని భారత ఎడిటర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా ఖండించింది.

Updated : 29 Jan 2021 17:30 IST

దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల వార్తలపై కవరేజీ ఇచ్చిన జర్నలిస్టులపై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని భారత ఎడిటర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా మీడియాను బెదించడం, వేధించడంతో పాటు అణచివేసే ప్రయత్నంలో భాగమేనని స్పష్టం చేసింది. జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను వెంటనే విరమించుకోవాలని ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసులను డిమాండ్‌ చేసింది.

దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హింస చెలరేగడానికి కారణమయ్యారంటూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌తో పాటు ఆరుగురు పాత్రికేయులపై నోయిడా పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. వీరిలో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, మృణాల్‌ పాండే తదితర జర్నలిస్టుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. దేశద్రోహంతో పాటు పదిరకాల సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ చర్యలను ఎడిటర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా ఖండించింది.

ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మరణంపై వార్తలు ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియేనని..ఈ విషయంలో మీడియా నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలను ప్రసారం చేసిన విషయాన్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ ప్రస్తావించింది. కేవలం మీడియాను అణచివేసే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసులు నమోదు చేసినట్లు ఆరోపించిన ఎడిటర్స్‌ గిల్డ్‌.. మీడియా స్వేచ్ఛగా బాధ్యతలు నిర్వహించే వాతావరణం కల్పించాలని సూచించింది.

ఇవీ చదవండి..
దిల్లీ-యూపీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలు - రాష్ట్రపతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని