అందరికీ టీకా లభిస్తుంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ

టీకా కావాలనుకున్న ప్రతి ఒక్కరికీ దానిని అందచేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ హామీ ఇచ్చింది.

Published : 21 Jan 2021 13:55 IST

పేదలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హామీ

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా సుమారు యాభై దేశాల్లో కరోనా టీకా పంపిణీ ఆరంభమైంది. కాగా, వాటిలో నలభై సంపన్న దేశాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అల్పాదాయ దేశాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీకా కావాలనుకున్న ప్రతి ఒక్కరికీ దానిని అందచేస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.

అన్ని దేశాల ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందచేసేందుకు తాము కృషి చేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయ డైరెక్టర్‌ జనరల్ మేరీయాంజెలా సిమావో ప్రకటించారు. అంతర్జాతీయంగా కరోనా వ్యాక్సిన్‌ సేకరణ, పంపిణీ చేసేందుకు ‘కోవాక్స్‌’ పేరిట ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 92 అల్పాదాయ, మధ్య తరగతి దేశాల్లో కొవిడ్‌ టీకా సరఫరాకు ఆర్థిక వనరులు సమకూర్చుతామని ఓ సోషల్‌ మీడియా సమావేశంలో సిమావో స్పష్టం చేశారు. ఇందుకుగాను రెండు బిలియన్‌ డోసులు అందించేందుకు ఐదు టీకా తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు మేరీయాంజెలా వెల్లడించారు.

ఈ సంవత్సరాంతానికల్లా.. సభ్య దేశాల్లో ఇరవై శాతం మందికి వ్యాక్సిన్‌ అందచేయటమే తమ లక్ష్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయ డైరెక్టర్‌ జనరల్ అన్నారు. ఫిబ్రవరి నెలాకరు కల్లా ఆయా దేశాలకు తొలి డోసులు అందించేందుకు అవసరమైన టీకాలను సేకరిస్తున్నామని సిమావో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టీకా తయారు చేస్తున్న 64 సంస్థలు మానవులపై  ప్రయోగాలు జరిపాయని.. వాటిలో 22 చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు ఫైజర్‌ సంస్థకు చెందిన టీకాకు మాత్రమే అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.

ఇదీ చదవండి..

టీకా వేయించుకోనున్న ప్రధాని మోదీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని