Jammu Kashmir: జమ్మూలో తప్పిన పెను ముప్పు.. హైవే వెంబడి ఐఈడీని గుర్తించిన పోలీసులు

జమ్మూ- కశ్మీర్‌లో గురువారం పెను ప్రమాదం తప్పింది! జమ్మూ శివార్లలో హైవే వెంబడి పోలీసులు ఓ ఐఈడీని గుర్తించి, దాన్ని నిర్వీర్యం చేశారు. సిధ్రా వద్ద హైవేపై ఉగ్రవాదులే ఈ పేలుడు పదార్థాన్ని అమర్చినట్లు అనుమానిస్తున్నామని అధికారులు...

Published : 29 Apr 2022 02:22 IST

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లో గురువారం పెను ప్రమాదం తప్పింది! జమ్మూ శివార్లలో హైవే వెంబడి పోలీసులు ఓ ఐఈడీని గుర్తించి, దాన్ని నిర్వీర్యం చేశారు. సిధ్రా వద్ద హైవేపై ఉగ్రవాదులే ఈ పేలుడు పదార్థాన్ని అమర్చినట్లు అనుమానిస్తున్నామని అధికారులు తెలిపారు. ‘జమ్మూ నగర శివార్లలోని సిధ్రా ప్రాంతంలో హైవే పక్కన కొన్ని అనుమానాస్పద వస్తువులు కనిపించినట్లు సమాచారం అందింది. దీంతో సమీపంలోని స్టేషన్ నుంచి ఒక బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం సీనియర్ అధికారులూ అక్కడికి వెళ్లారు’ అని జమ్మూ అడిషనల్ డీజీపీ ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాన్ని గుర్తించిన ప్రాంతాన్ని పోలీసులు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అనంతరం జమ్మూ పోలీసు విభాగంలోని బాంబు స్క్వాడ్ బృందం ఆ ఐఈడీని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

జమ్మూలో వారం వ్యవధిలో ఉగ్రవాద సంబంధిత మూడో ఘటన ఇది. దీంతో స్థానికంగా తీవ్ర భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్నాయి. గత శుక్రవారం జమ్మూ శివార్లలోని జలాలాబాద్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఒక సీఐఎస్‌ఎఫ్ అధికారి వీర మరణం పొందగా.. తొమ్మిది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అనంతరం ఆదివారం ఇక్కడి బిష్నాలో ఒక శక్తిమంతమైన పేలుడు సంభవించింది. అదే రోజు ఘటనా స్థలానికి 17 కి.మీల దూరంలోని పల్లి గ్రామ సమీపంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని