Lakhimpur Kheri Violence: 18న రైల్‌ రోకో.. 26న మహాపంచాయత్‌!

లఖింపుర్‌ ఖేరి ఘటనకు నిరసనగా రైతు సంఘాలు శనివారం పెద్దఎత్తున కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో, 26న లఖ్‌నవూలో మహాపంచాయత్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. కేంద్ర మంత్రి అజయ్‌...

Published : 09 Oct 2021 22:09 IST

లఖ్‌నవూ: లఖింపుర్‌ ఖేరి ఘటనకు నిరసనగా రైతు సంఘాలు శనివారం పెద్దఎత్తున కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో, 26న లఖ్‌నవూలో మహాపంచాయత్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని, ఆయన కుమారుడు ఆశిష్‌ను వెంటనే అరెస్టు చేయాలని మరోసారి డిమాండ్‌ చేశాయి. ఈ ఘటనను రైతుల ఊచకోతగా అభివర్ణించిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం).. దేశ వ్యవసాయ ఉద్యమ చరిత్రలో దీన్నొక బాధాకర అధ్యాయంగా స్మరించుకుంటారని పేర్కొంది.

‘లఖింపుర్‌ ఘటన జలియన్‌వాలా బాగ్ ఉదంతం కంటే తక్కువేమీ కాదు. ఈ ఘటనలో మృతి చెందిన రైతుల సంస్మరణార్థం ఈ నెల 12న లఖింపుర్‌ ఖేరిలో నిర్వహించనున్న కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల అన్నదాతలు పాల్గొంటారు. ఆ రోజును ‘షహీద్‌ కిసాన్‌ దివస్‌’గా నిర్వహిస్తాం. అదే రోజు రాత్రి పౌరులు తమ ఇళ్ల ముందు కొవ్వొత్తులు వెలిగించాలని, పౌర సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టాలని కోరుతున్నాం’ అని ఎస్‌కేఎం నేత యోగేంద్ర యాదవ్ వివరించారు. అలాగే, ‘షహీద్‌ కిసాన్‌ కలశ్‌ యాత్ర’ పేరిట లఖింపుర్‌ ఘటనలో మృతి చెందిన రైతుల అస్థికలతో దేశవ్యాప్త పర్యటన నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబరు 15న దిష్టిబొమ్మలు దహనం చేసి రైతులందరూ తమ నిరసన వ్యక్తం చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా చేపడతామని తెలిపారు. అంతకుముందు రైతు నేతలు ఈ ఘటనను ‘ముందస్తు ప్రణాళికతో పన్నిన కుట్ర’గా పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని