Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు

దర్శకురాలు, నటి లీనా మణిమేగలై తన తాజా చిత్రం ‘కాళీ’కి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసి దుమారం రేపారు.........

Published : 06 Jul 2022 02:09 IST

దిల్లీ: దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై (Leena Manimekalai) తన తాజా చిత్రం ‘కాళీ’(Kaali)కి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసి దుమారం రేపారు. ఆ పోస్టర్‌ తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. మతపరమైన మనోభావాలను లీనా దెబ్బతీశారని, ఆమెను అరెస్టు చేయాలంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ‘గో మహాసభ’ ప్రతినిధులు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా దర్శకురాలిపై కేసు నమోదైంది. తాజాగా ‘కాళీ’ డాక్యుమెంటరీ నిర్మాతలపైనా దిల్లీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో కేసులు నమోదయ్యాయి. ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, నేరపూరిత కుట్ర, శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశం వంటి అభియోగాలను మోపారు.

కాళీ పోస్టర్‌ తీవ్ర దుమారం రేపడంతో ‘అరెస్ట్‌ లీనా మణిమేగలై’ హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌లో ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే లీనా ట్విటర్‌లో స్పందించారు. ‘నేను నమ్మిన విషయాన్ని బతికున్నంతవరకూ నిర్భయంగా చెబుతా. నా ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా, అందుకు సిద్ధమే’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం టొరంటో అగాఖాన్‌ మ్యూజియంలోని రిథమ్స్‌ ఆఫ్‌ కెనడా విభాగానికి చెందినదని, పోస్టరులోని సందర్భాన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమాను పూర్తిగా చూడాలని కోరారు. ‘ఈ చిత్రాన్ని చూశాక లవ్‌ యూ లీనా మణిమేగలై అని మీరే అంటారు’’ అని ఆమె పేర్కొన్నారు. మధురైలో జన్మించిన లీనా ప్రస్తుతం టొరంటోలో ఉంటున్నారు.

కెనడాలోని హిందూ సమాజం నుంచి విజ్ఞప్తులు రావడంతో అక్కడి భారత హైకమిషన్ సోమవారం ‘కాళీ’ పోస్టర్‌పై ఓ ప్రకటన విడుదల చేసింది. మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా ఉన్న ఆ పోస్టర్‌ను తొలగించాలంటూ కెనడా అధికారులు, ఈవెంట్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని