1,110కి చేరిన కొవిడ్‌-19 మృతులు

కరోనా వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 1,110కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 94 మంది మృత్యువాతపడ్డారు. వీరంతా హుబెయ్ ప్రావిన్సుకు చెందినవారే కావడం గమనార్హం..........

Updated : 12 Feb 2020 09:32 IST

బీజింగ్‌: చైనాలో కొవిడ్‌ -19 వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 1,110కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 94 మంది మృత్యువాతపడ్డారు. వీరంతా హుబెయ్ ప్రావిన్సుకు చెందినవారే కావడం గమనార్హం. మరో 1,638 మందికి కొత్తవారికి వైరస్ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 44,200కు చేరింది. 99శాతం మంది వైరస్ బాధితులు చైనాలోనే ఉన్నప్పటికీ.. ఇతర దేశాల్లోకి ఇది పాకే ప్రమాదం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో  కొవిడ్‌ వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని కోరింది. తద్వారా వైరస్ కట్టడికి జరుగుతున్న పరిశోధనలకు సహకరించాలని తెలిపింది. మరోవైపు వైరస్‌ కట్టడికి పోరు కొనసాగిస్తున్న చైనా మంగళవారం హుబెయ్‌ ప్రావిన్సుకు చెందిన ఇద్దరు ఆరోగ్య శాఖ అధికారులను విధుల నుంచి బహిష్కరించింది. వైద్య సేవల్లో అలక్ష్యం ప్రదర్శించిన కారణంగానే వీరిని తొలగించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ వైరస్‌కు కొవిడ్‌-19గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. కరోనా(సీవో), వైరస్‌(వీఐ), వ్యాధి(డీ) అనే పదాలకు సంక్షిప్త రూపంగా ఈ పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఖరారు చేసింది.

జపాన్ నౌకలో మరో 39 మందికి...

మరోవైపు వైరస్‌ భయంతో జపాన్‌ యొకొహామా పోర్టులో నిలిపి ఉంచిన విహార నౌకలో మరో 39 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. తాజాగా 53 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 39 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో నౌకలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 174కి చేరింది. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగతా ప్రయాణికులను క్యాబిన్లకే పరిమితం చేశారు. మాస్కులు ధరించాలని.. బహిరంగ ప్రదేశంలోకి రావొద్దన్న ఆంక్షలు విధించారు. దీంతో దాదాపు వారం రోజులుగా ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫిబ్రవరి 19న వారిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నౌకలో ఉన్న భారతీయులతో అక్కడి భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని