భారత్‌లో ఇరాన్‌ పర్యాటకులకు కరోనా పరీక్షలు

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్‌ భారత్‌లోనూ ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు భారత్‌లో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా అనుమానంతో ఇరాన్‌కు చెందిన....

Published : 06 Mar 2020 22:28 IST

చండీగఢ్‌: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్‌ భారత్‌లోనూ ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు భారత్‌లో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా అనుమానంతో ఇరాన్‌కు చెందిన 13 మంది పర్యాటకులను పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని ఓ హోటల్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు అక్కడి అధికారులు తెలిపారు. వీరంతా గురువారం రాత్రి అమృత్‌సర్‌ చేరుకున్నట్లు సమాచారం. వారిని హోటల్ గదులు దాటి బయటకు రావొద్దని కోరినట్లు అధికారులు వెల్లడించారు.

‘‘ప్రస్తుతం ఇరాన్‌కు చెందిన 13 మంది పర్యాటకులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారికి మేం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్షలు ముగిసేంత వరకు వారిని హోటల్ దాటి బయటకు వెళ్లొద్దని కోరాం. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపుతాం’’ అని ప్రభ్‌దీప్ కౌర్ అనే వైద్య అధికారిణి తెలిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించి, ముందస్తు జాగ్రత్తలపై చర్చించినట్లు సమాచారం. ఇక పొరుగు దేశం భూటాన్‌లో కూడా తొలి కరోనా కేసు నమోదయినట్లు ఆ దేశం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని