కరోనా ఎఫెక్ట్‌: జైళ్లలో వసతుల పరిస్థితేంటి?

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జైళ్లలో తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, జైళ్ల శాఖ డీజీలకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు ఇచ్చింది.......

Published : 16 Mar 2020 18:12 IST

రాష్ట్రాలను వివరణ కోరిన సుప్రీంకోర్టు

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జైళ్లలో తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, జైళ్ల శాఖ డీజీలకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 20 నాటి వారి స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. ఈ విషయంలో కోర్టుకు సహకరించేందుకు ప్రతి రాష్ట్రం మార్చి 23 నాటికి ఓ వ్యక్తిని నియమించాలని తెలిపింది. దేశంలో రోజురోజుకీ వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో జైళ్లలో కల్పిస్తున్న సదుపాయాల పరిస్థితిని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించింది. బాలనేరస్థుల సంరక్షణ కేంద్రాలపైనా దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయని.. మరికొన్ని ఇంకా మేలుకోవాల్సి ఉందని సుప్రీం అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో గుంపులుగా నివసించడం ఆలోచించాల్సిన అంశమని పేర్కొంది.  వైరస్‌ వ్యాప్తికి ఇవి కేంద్రాలుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై కచ్చిమైన మార్గదర్శకాలు రూపొందించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాన్ని ఎందుకు సుమోటోగా స్వీకరించాల్సి వచ్చిందో కూడా కారణాలు తెలియజేస్తామని తెలిపింది.

అంతకుముందు సుప్రీంకోర్టు పరిసరాల్లో తీసుకుంటున్న చర్యలను కోర్టు సమీక్షించింది. కోర్టులు అనారోగ్యానికి నిలయాలుగా మారకూడదని వ్యాఖ్యానించిన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ఆరుగురు సభ్యుల ధర్మాసనం త్వరలో వర్చువల్‌ కోర్టులను ఏర్పాటకు కృషి చేస్తామంది. లాయర్లు ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమ వాదనలు వినిపించొచ్చని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే అన్ని రాష్ట్రాల హైకోర్టులను సంప్రదిస్తున్నారని.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని చంద్రచూడ్‌ తెలిపారు. కోర్టుకు వచ్చే ప్రతిఒక్కరూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని.. మార్గదర్శకాల్ని పాటించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని