కరోనా అనుమానితుల చేతిపై స్టాంపులు!

కరోనా వైరస్‌ ప్రాబల్యాన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ వైవిధ్యమైన నిర్ణయం తీసుకుంది.

Updated : 17 Mar 2020 12:46 IST

కరోనా వ్యాప్తి నిరోధానికి మహారాష్ట్ర ప్రభుత్వ చర్యలు...

ముంబయి: కరోనా వైరస్‌ కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానితుల చేతిపై చెరిగిపోని ఇంకుతో స్టాంపు వేయాలని నిర్ణయించింది. ఆ స్టాంపులో ‘‘ముంబయి వాసులను రక్షిస్తున్నందుకు గర్వపడుతున్నాను. హోమ్‌ క్వారంటైన్డ్‌’’ అన్న వ్యాఖ్యతో పాటు... వారు ఏ తేదీ వరకు క్వారంటైన్‌లో ఉండాలి అనే సమాచారం కూడా ఉంటుంది. కాగా ఈ చర్య ద్వారా వారిని గుర్తించటం సులభమౌతుందని... వారు సాధారణ ప్రజలతో కలవకుండా నిరోధించవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. ఇరాన్‌లో రెండు కేసులతో మొదలైన కరోనా వైరస్‌.. రెండో వారంలో 43, మూడో వారంలో 245, అనంతరం ఐదో వారంలో 12,500కు చేరటాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

ఇప్పటి వరకు మహారాష్ట్రలో 36 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల ఇతరులకు కరోనా సోకే రెండో దశలో ఈ రాష్ట్రం ఉంది. సమాజంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తించడం కరోనాలో మూడో దశ. ఈ విధమైన వ్యాప్తిని నిరోధించటానికి మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. కరోనాపై పోరులో రానున్న 20 రోజులు అతిముఖ్యమైనవని మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పాక్షిక మూసివేతకు ఆదేశాలిచ్చింది. 

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్‌లో ఉంచుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండటానికి ఇష్టపడని వారి కోసం.. విమానాశ్రయం సమీపంలోని హోటళ్లలో కూడా క్వారంటైన్‌ ఏర్పాట్లు చేసింది. కాగా అందుకయ్యే ఖర్చులను వ్యక్తులే భరించాల్సి ఉంటుంది. ఐతే ఇది సాధారణ హోటల్‌ ధరలో సగమే ఉంటుందని ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇప్పటికే నగరంలోని మిరాజ్‌, ఐటీసీ మరాఠా హోటళ్లలో ప్రభుత్వం క్వారంటైన్‌ ఏర్పాట్లు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని