భారత సైన్యంలో తొలి కరోనా కేసు!

భారత సైన్యానికి చెందిన ఓ జవాన్‌కు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఆయన తండ్రి ఇరాన్‌ తీర్థయాత్రకు వెళ్లివచ్చినట్లు అధికారులు తెలిపారు.......

Updated : 18 Mar 2020 19:09 IST

దిల్లీ: భారత సైన్యానికి చెందిన ఓ జవాన్‌కు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఆయన తండ్రి ఇరాన్‌ తీర్థయాత్రకు వెళ్లివచ్చినట్లు అధికారులు తెలిపారు. సైన్యంలో తొలి కరోనా కేసు ఇదే కావడం గమనార్హం. 

లద్దాఖ్‌ స్కౌట్స్‌ దళానికి చెందిన ఓ జవాన్‌కు కరోనా సోకినట్లు సోమవారం నిర్ధారణ అయిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌ పర్యటనకు వెళ్లిన ఆ జవాన్‌ తండ్రి ఫిబ్రవరి 27న భారత్‌కు వచ్చినట్లు తెలిపారు. ఫిబ్రవరి 29 నుంచి ఆయన్ని లద్దాఖ్‌లోని హార్ట్‌ ఫౌండేషన్‌లో క్వారంటైన్‌లో ఉంచగా.. మార్చి 6న కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు సెలవులపై ఇంటికెళ్లిన జవాన్‌ తిరిగి రెండో తేదీన విధుల్లో చేరారు. విధుల్లో చేరినప్పటికీ తండ్రి క్వారంటైన్‌లో ఉండడంతో ఇంటికి వెళ్లి కుటుంబానికి చేదోవాదోడుగా ఉంటూ గ్రామంలోనే ఉన్నాడని సైనిక వర్గాలు తెలిపాయి. తండ్రికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో జవాన్‌ని కూడా మార్చి 7 నుంచి క్వారంటైన్‌లో ఉంచినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. మార్చి 16న వైరస్‌ సోకినట్లు తేలిందన్నారు. ప్రస్తుతం జవాన్‌ కుటుంబమంతా క్వారంటైన్‌లో ఉందని తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు 147 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. వీరిలో ముగ్గురు మృతిచెందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని