కమల్‌హాసన్‌ ఇంటికి క్వారంటైన్‌ నోటీసు

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ గతంలో నివాసమున్న ఇంటిపై ‘హోం క్వారంటైన్‌’ అంటూ చెన్నై నగరపాలిక అధికారులు నోటీసులు అంటించారు.

Published : 28 Mar 2020 21:23 IST

పొరపాటుగా అంటించామన్న అధికారులు

చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ గతంలో నివాసమున్న ఇంటిపై ‘హోం క్వారంటైన్‌’ అంటూ చెన్నై నగరపాలిక అధికారులు నోటీసులు అంటించారు. అనంతరం పొరబాటుగా అంటించామని ప్రకటించడం గమనార్హం. ఈ భవనాన్ని ప్రస్తుతం ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ పార్టీ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. కాగా, దీనిని కరోనా రోగులకు చికిత్స అందించే తాత్కాలిక వైద్యశాలగా మారుస్తామని రెండురోజుల క్రితమే కమల్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇది తమను ఇబ్బంది పెట్టడానికి రాష్ట్రప్రభుత్వం చేసిన చర్య అని కమల్‌ ప్రతినిధి ఆరోపిస్తున్నారు.

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తిస్తున్న తరుణంలో విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగివచ్చిన వారి నివాసాలకు ఈ విధంగా ‘హోం క్వారంటైన్‌’ నోటీసులను అంటిస్తున్నారు. అయితే, ‘‘కమల్‌ హాసన్ జనవరి నుంచి భారత్‌లోనే ఉన్నారు. విదేశాలకు వెళ్లనే లేదు. సదరు భవనాన్ని ఆయన స్థాపించిన ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ కార్యాలయంగా ఉపయోగిస్తున్నాం. భవనం వెలుపల భద్రతా సిబ్బంది ఉన్నారు. వారిని కనీసం సంప్రదించకుండా అధికారులు క్వారంటైన్‌ నోటీసులు భవనం గోడలకు రాత్రిపూట అంటించారు.’’ అని పార్టీ అధికార ప్రతినిధి మురళీ అప్పాస్‌ వివరించారు.

ముందుజాగ్రత్త చర్యగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని, ప్రజలను కూడా పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశానని కమల్‌ తెలిపారు. అంతే తప్ప తాను క్వారంటైన్‌లో ఉన్నాననే వార్త అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఆయన కుమార్తె శృతిహాసన్‌ కూడా తమ కుటుంబం మొత్తం సెల్ఫ్‌-ఐసొలేషన్‌లో ఉన్నామని గతంలో తెలిపిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని