భారత్‌-చైనా ఘర్షణలను గమనిస్తున్నాం

భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై అమెరికా స్పందించింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తర్వాత నెలకొన్న వాతావరణాన్ని నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది. ఉభయ దేశాల మధ్య ఉన్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆకాంక్షించింది.......

Updated : 17 Jun 2020 09:30 IST

వాషింగ్టన్‌: భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై అమెరికా స్పందించింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తర్వాత నెలకొన్న వాతావరణాన్ని నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది. ఉభయ దేశాల మధ్య ఉన్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది భారత సైనికులకు సంతాపం ప్రకటించింది. వారి కుటంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఇప్పటికే ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇరు వర్గాలు చర్యలు తీసుకున్నాయని గుర్తుచేసింది. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అమెరికా తరఫున కావాల్సిన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. జూన్‌ 2న అధ్యక్షుడు ట్రంప్‌, ప్రధాని మోదీ మధ్య జరిగిన సంభాషణలో చైనాలో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనపై చర్చలు జరిగిన విషయం తెలిసిందే.

భారత్‌-చైనా సరిహద్దులో చెలరేగిన ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని కోరారు. ఇప్పటికే బలగాల ఉపసంహరణకు ఇరు దేశాలూ అంగీకరించడం శుభసూచకమన్నారు. 

లద్దాఖ్‌లో చైనాతో ఆరు వారాలుగా నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన సోమవారం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇరు దేశాలకు చెందిన సైనికులు భౌతిక ఘర్షణకు దిగారు. ఓవైపు శాంతి చర్చలు, సైనిక ఉపసంహరణ అంటూనే దొంగ దెబ్బ తీసిన చైనా వైఖరి 20 మంది భారత సైనికుల ప్రాణాలను బలిగొంది. చైనా వైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సైనికాధికారి కర్నల్‌ సంతోష్‌ కుమార్‌ కూడా వీరమరణం పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని