పెళ్లిలో క‌రోనా: వ‌రుడి మృతి, 110మందికి వైర‌స్‌!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోన్న స‌మ‌యంలో ప్ర‌జ‌లు స‌మూహాలుగా ఏర్ప‌డ‌వ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. శుభ‌కార్యాల్లో కూడా అతి త‌క్కువ‌మంది పాల్గొనాల‌ని హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. ఇలాంటి సూచ‌న‌ల‌ను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఓ శుభ‌కార్యం చివ‌ర‌కు విషాధాన్ని మిగిల్చిన ఘ‌ట‌న బిహార్‌లో చోటుచేసుకుంది.

Updated : 01 Jul 2020 17:12 IST

క‌రోనాకు కేంద్ర బిందువుగా మారిన‌ పెళ్లి వేడుక‌

పాట్నా: దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌ మ‌హ‌మ్మారి విజృంభిస్తోన్న స‌మ‌యంలో ప్ర‌జ‌లు స‌మూహాలుగా ఏర్ప‌డ‌వ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. శుభ‌కార్యాల్లో కూడా అతి త‌క్కువ‌మంది పాల్గొనాల‌ని హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. ఇలాంటి సూచ‌న‌ల‌ను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఓ శుభ‌కార్యం చివ‌ర‌కు విషాదాంతమైన ఘ‌ట‌న బిహార్‌లో చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు మ‌ర‌ణించ‌డంతోపాటు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 110మందికిపైగా బంధువులకు క‌రోనా వైర‌స్‌ సోకింది.

పాట్నాకు స‌మీపంలోని‌ పాలిగంజ్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ గుర్‌గావ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ‌జూన్ 15‌న అతని వివాహం బిహార్‌లో జ‌రిగింది. అయితే, వివాహ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలోనే అత‌నికి కొవిడ్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. చివ‌ర‌కు డ‌యేరియాగా అనుమానించి పాట్నాలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స అందించారు. ఆ స‌మ‌యంలో అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డ‌లేదు. అయినా వ‌రుడి కుటుంబస‌భ్యులు ఒత్తిడి తెచ్చి యువ‌కుడి వివాహం ఘ‌నంగా జ‌రిపించారు. చివ‌ర‌కు వివాహ‌మైన రెండో రోజే పెళ్లి కుమారుడు మృత్యువాత‌ప‌డ్డాడు.

ఈ విష‌యాన్ని ఓ వ్య‌క్తి నేరుగా జిల్లా క‌లెక్ట‌ర్‌కు తెలియ‌జేయ‌డంతో అధికారులు రంగంలోకి దిగారు. అప్ప‌టికే కుటుంబస‌భ్యులు అంత్య‌క్రియ‌లు కూడా పూర్తి చేయ‌డంతో అత‌నికి కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష నిర్వ‌హించ‌లేక‌పోయిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. అత‌నికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించిన అధికారులు తొలుత అత‌ని సమీప బంధువుల్లో 15మందికి కొవిడ్‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వారంద‌రికీ వైర‌స్ ఉన్న‌ట్లు తేలింది. అప్ప‌టికే పెళ్లికి హాజ‌రైన‌ వారిలో చాలామందిలో ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్లు గుర్తించిన అధికారులు వారంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 110మందికి పైగా క‌రోనా వైర‌స్‌ సోకినట్లు తేలింది. పెళ్లి కుమార్తెకు మాత్రం వైర‌స్ సోక‌లేద‌ని తెలిపారు. ఈ వివాహానికి దాదాపు 350మంది హాజ‌రైనట్లు అంచ‌నా వేసిన‌ అధికారులు వారంద‌రినీ వెతికే ప‌నిలోప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ రాష్ట్రంలో సూపర్‌స్ప్రెడ్‌ ఘటనగా మారడంతో పెళ్లికి హాజ‌రైన వారితోపాటు అంత్య‌క్రియ‌ల‌కు వ‌చ్చిన వారిని కూడా గుర్తించే ప‌నిలోప‌డ్డారు అధికారులు. ఇప్ప‌టికే దాదాపు 400 మందిని గుర్తించిన అధికారులు, ప్ర‌త్యేక క్యాంపు ఏర్పాటు చేసి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

దేశవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న దృష్ట్యా కేవ‌లం శుభ‌కార్యాల్లో 50మంది, అంత్య‌క్రియ‌ల్లో 20మంది మాత్ర‌మే పాల్గొనాల‌ని ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు విధించిన విష‌యం తెలిసిందే. బిహార్‌లో ఇప్ప‌టివ‌రకు 10,043 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా వీరిలో 64మంది మృత్యువాత‌ప‌డ్డారు. 

ఇవీ చ‌దవండి..
భార‌త్‌: ఒక్క నెల‌లో 4ల‌క్ష‌ల కేసులు, 12వేల మ‌ర‌ణాలు
92శాతం మంది మృత్యుంజ‌యులే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని