Ganga River:మృతదేహాలు గంగపాలు కాకుండా చూడండి

గంగ.. దాని ఉపనదుల్లో మృతదేహాలు పడేయకుండా నిఘా పెట్టాలని ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలను

Updated : 17 May 2021 10:37 IST

 నిఘా పెట్టాలంటూ యూపీ, బిహార్‌లకు కేంద్రం ఆదేశం

దిల్లీ: గంగ.. దాని ఉపనదుల్లో మృతదేహాలు పడేయకుండా నిఘా పెట్టాలని ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలను ఆదివారం కేంద్రం ఆదేశించింది. నదుల్లో కొట్టుకువస్తున్న శవాలు కనిపిస్తే వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలని సూచించింది. ఇందులో ఎలాంటి ఆలస్యం చేయకుండా, తమ ఆదేశాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ విషయమై వరుసగా శని, ఆదివారాల్లో కేంద్ర ప్రభుత్వం సమీక్షలు జరిపింది. ఇటీవలి కాలంలో గంగానది, దాని ఉపనదుల్లో సగం కాలిన శవాలు, అంత్యక్రియలు నిర్వహించని.. కుళ్లిన మృతదేహాలు కొట్టుకురావడం అవాంఛనీయం, ప్రమాదకరమని కేంద్రం పేర్కొంది. ఇటువంటి చర్యలు ‘నమామి గంగ’ ప్రాజెక్టు లక్ష్యానికి విరుద్ధమని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ఆరోగ్యశాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ నీటి నాణ్యతను తరచూ పరీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చూడాలని సూచించారు. ఈ మేరకు ‘క్లీన్‌ గంగ’ జాతీయ పథకం డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా జిల్లాస్థాయిలో ‘క్లీన్‌ గంగ’ అధ్యక్షులుగా ఉన్న జిల్లా న్యాయమూర్తులకు పలు సూచనలు చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులకు కూడా వీటిని పంపారు.

గంగానది ఒడ్డున పోలీసు పహరా

బిహార్‌లోని గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు బయటపడిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. నదిలోకి ఎవరూ శవాలను విసిరేయకుండా పటిష్ఠ పహారా కాస్తున్నారు. గంగానది ఒడ్డున పడవల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు బక్సర్‌ జిల్లాలోని చౌసా ప్రాంత ఏఎస్‌ఐ వీఎన్‌ ఉపాధ్యాయ్‌ వెల్లడించారు. మృతదేహాలు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకొని అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నదిలో బయటపడిన మృతదేహాలు స్థానికులవి కాదని, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కొట్టుకువచ్చి ఉంటాయని బక్సర్‌ గంగా ఘాట్‌కు చెందిన పురోహితుడు ధనంజయ్‌ కుమార్‌ పాండే తెలిపారు. పాముకాటుతో లేదా టీబీతో చనిపోయినవారి మృతదేహాలకు చివరి సంస్కారాలు నిర్వహించకుండా.. ఇలా నీటిలో వదిలేస్తారని చెప్పారు. బక్సర్‌ జిల్లాలో గంగానది నుంచి 71 మృతదేహాలను వెలికితీసినట్లు బిహార్‌ మంత్రి సంజయ్‌కుమార్‌ ఇటీవల వెల్లడించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యూపీ సరిహద్దులో నదిపై వలలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని