Kim: స్లిమ్‌ కిమ్‌.. అనారోగ్యమే కారణం?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.

Updated : 17 Jun 2021 11:00 IST

సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన బరువు తగ్గినట్లు కనిపించడమే అందుకు కారణం. కిమ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ గతేడాది కూడా ప్రచారం జరిగింది. కొన్ని నెలలుగా ఆయన బయటి ప్రపంచానికి కనిపించకపోవడంతోనే అలాంటి వార్తలు మొదలయ్యాయి. తాజాగా తమ వర్కర్స్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న కిమ్‌ ఫొటోలను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ప్రచురించింది. వాటిలో కిమ్‌ కాస్త సన్నబడినట్లు కనిపిస్తున్నారు. భారీకాయుడైన కిమ్‌ 140 కిలోలు ఉండేవారని, ఇప్పుడు 10-20 కిలోల వరకూ తగ్గారని కొందరు పరిశీలకులు చెబుతున్నారు. ఆయన ముఖం చిన్నగా కనిపిస్తోందని, తను నిత్యం ధరించే ఖరీదైన చేతి గడియారం పట్టీని బిగించి కట్టినట్లు ఫొటోల ద్వారా తెలుస్తోందని వారు చెప్పారు. అయితే సన్నబడినంత మాత్రాన అనారోగ్యంతో ఉన్నట్లు చెప్పలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అధిక బరువుతో ఉండడంతో పాటు ఎక్కువ మోతాదులో ధూమపానం, మద్యపానం చేసే కిమ్‌కు గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించి ఉంటారని, బరువును తగ్గించుకునే క్రమంలోనే ఆయన సన్నబడి ఉండొచ్చని చెబుతున్నారు. కిమ్‌ నిజంగా అనారోగ్యంతో ఉండి ఉంటే పార్టీ సమావేశానికి వచ్చి ఉండేవారు కాదు అని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని