Mucormycosis: డెంగీ సోకిన వ్యక్తికి మ్యూకర్‌మైకోసిస్‌

కరోనా రెండో దశ సమయంలో అలజడి సృష్టించిన మ్యూకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌).. దిల్లీలో డెంగీ సోకిన వ్యక్తిలో

Published : 14 Nov 2021 11:49 IST

దిల్లీ: కరోనా రెండో దశ సమయంలో అలజడి సృష్టించిన మ్యూకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌).. దిల్లీలో డెంగీ సోకిన వ్యక్తిలో కనిపించడం కలకలం సృష్టిస్తోంది. ఇది చాలా అరుదైన కేసుగా వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.‘‘అకస్మాత్తుగా ఒక కంటి చూపును కోల్పోయానంటూ ఓ వ్యక్తి మా ఆస్పత్రికి వచ్చారు. అంతకుముందు ఆ రోగికి డెంగీ జ్వరం వచ్చింది. దాని నుంచి కోలుకుంటున్న సమయంలో మ్యూకర్‌మైకోసిస్‌ సోకింది. సాధారణంగా మధుమేహం అధికంగా ఉన్న రోగుల్లో ఇది కన్పిస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గినా ఇది ప్రభావం చూపిస్తుంది’’ అని దక్షిణ దిల్లీలోని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపాయి. ఆస్పత్రికి వచ్చే ముందు రోగి ముక్కు నుంచి రక్తస్రావమైందని, ప్లేట్‌లెట్స్‌ సంఖ్య కూడా తగ్గిందని ఆస్పత్రి వైద్యుడు నిషాంత్‌ రాణా తెలిపారు. డెంగీ నుంచి కోలుకుంటున్న సమయంలో మ్యూకర్‌మైకోసిస్‌ సొకవచ్చన్నది కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయమని, డెంగీ రోగులంతా అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం లక్షణాలు కనిపించినా ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొవిడ్‌-19, మధుమేహం, మూత్ర పిండాల వ్యాధులు, కాలేయ, గుండె సంబంధిత రుగ్మతలు, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి వ్యాధులకు మందులు తీసుకున్న వారికి ఈ బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. ‘‘ఇది ప్రాణాంతకమైన ఫంగస్‌. ముక్కు, కళ్లు, మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలాల్లోకి చొచ్చుకు పోతుంది. రోగనిర్ధారణ, నిర్వహణలో ఆలస్యం జరిగితే దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది’’ అని అపోలో ఈఎన్‌టీ వైద్య నిపుణుడు సురేశ్‌సింగ్‌ హెచ్చరించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని