Bipin Rawat: కాలిలో తూటా దిగినా.. ధీశాలి బిపిన్‌ రావత్‌ ప్రస్థానం

అది 1993 మే 17.. మేజర్‌ హోదాలో 35 ఏళ్ల బిపిన్‌ రావత్‌ జమ్మూ-కశ్మీర్‌లోని యురి ప్రాంతంలో గస్తీ విధులు నిర్వర్తిస్తున్నారు.

Published : 10 Dec 2021 12:15 IST

దిల్లీ: అది 1993 మే 17.. మేజర్‌ హోదాలో 35 ఏళ్ల బిపిన్‌ రావత్‌ జమ్మూ-కశ్మీర్‌లోని యురి ప్రాంతంలో గస్తీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో పాకిస్థాన్‌ సైన్యం భారీగా కాల్పులు జరిపింది. ఇందులో ఒక తూటా ఆయన చీలమండలో దిగింది. అదృష్టవశాత్తూ ఆయన కాళ్లకు క్యాన్వాస్‌ యాంక్లెట్‌ అనే రక్షణ తొడుగు ఉంది. అందువల్ల తూటా జోరుకు కొంత మేర కళ్లెం పడింది. అయినా అది ఆయన చీలమండలోకి దిగింది. వెంటనే ఆయనను శ్రీనగర్‌లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. అయితే నాడు యువ రావత్‌ను వేధించింది గాయం కాదు. తన సైనిక కెరీర్‌ గురించే ఆయన ఆందోళన చెందారు. గాయం కారణంగా తాను ‘వైద్యపరంగా దిగువస్థాయి విభాగం’లోకి వెళ్లిపోతానేమోనని కలత వహించారు. దీనివల్ల తాను మౌ (మధ్యప్రదేశ్‌)లోని సైనిక శిక్షణ కేంద్రంలో సీనియర్‌ కమాండ్‌ కోర్సు చేయలేనేమోనని బాధపడ్డారు. సైన్యంలో ఉన్నత హోదాలు చేపట్టడానికి ఈ కోర్సు పూర్తి చేయడం తప్పనిసరి.

‘‘సైన్యంలో ఇక నీ కెరీర్‌ ముగిసినట్లే అంటూ ఎవరో చేసిన వ్యాఖ్యలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అయితే ధైర్యాన్ని వీడకుండా ఊతకర్ర సాయంతో నడవడం సాధన చేశా. నెల పాటు అనారోగ్య సెలవు తీసుకొని తిరిగి సైనిక ఆసుపత్రికి వచ్చా. వైద్యులు నన్ను పరీక్షించి పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ (షేప్‌1)గా ఉన్నట్లు తేల్చారు. అయితే తదుపరి నాకు పోస్టింగ్‌ ఎక్కడ ఇవ్వాలన్న ప్రశ్న ఉత్పన్నమైంది. లఖ్‌నవూలోని గూర్ఖా రెజిమెంటల్‌ సెంటర్‌కు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. యురీలోని మా కమాండింగ్‌ అధికారి నన్ను అక్కడే కొనసాగించడానికి అనుమతించారు. అయితే సరిహద్దుల వద్ద గస్తీ విధులు మాత్రం నిర్వర్తించలేకపోయా. క్రమేపీ చీలమండ సాధారణ స్థితికి వచ్చింది. ఇలాంటి ఘటనలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ప్రతి ఎదురుదెబ్బనూ ఎదుర్కొంటూనే ముందడుగు వేశా’’ అని గతంలో ఒక మేగజైన్‌కు రాసిన వ్యాసంలో రావత్‌ పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని