గోధ్రా దోషికి 17 ఏళ్ల తర్వాత బెయిల్‌

గుజరాత్‌ అల్లర్లకు కారణమైన గోధ్రా రైలు బోగీ దహనం కేసు(2002)లో జీవితఖైదు అనుభవిస్తున్న ఫారుక్‌ అనే దోషికి సుప్రీంకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 16 Dec 2022 05:48 IST

దిల్లీ: గుజరాత్‌ అల్లర్లకు కారణమైన గోధ్రా రైలు బోగీ దహనం కేసు(2002)లో జీవితఖైదు అనుభవిస్తున్న ఫారుక్‌ అనే దోషికి సుప్రీంకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా దరఖాస్తుదారుడు 17 ఏళ్లు సుదీర్ఘంగా జైలులో గడిపిన విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. అయితే ఈ బెయిల్‌ను గుజరాత్‌ ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తీవ్రంగా వ్యతిరేకించారు. దోషిపై ఆరోపణలు తీవ్రమైనవని, ఈ ఘటనలో 59 మంది సజీవంగా దహనమయ్యారని, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. దీన్ని సాధారణ రాళ్ల దాడిగా చూడకూడదని, తగలబడుతున్న బోగీలోంచి బాధితులు బయటికి రాకుండా చేసేందుకు పాల్పడిన దుర్మార్గమైన చర్యగా ధర్మాసనం పరిగణించాలని మెహతా కోరారు. బెయిల్‌ కోరుతున్న వ్యక్తి.. ఇతరులను కూడా రాళ్లు విసిరేలా ప్రేరేపించాడని తెలిపారు. ఈ కేసులోని అనేక మంది దోషుల అప్పీళ్లు సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగులో ఉన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహల ధర్మాసనం దృష్టికి సొలిసిటర్‌ జనరల్‌ తీసుకొచ్చారు. ఆ వివరాలను తనకు ఇవ్వాలని, వాటిని పరిశీలిస్తానని సీజేఐ తెలిపారు.

* రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు తీసుకువచ్చిన ఎన్నికల బాండ్లను సవాల్‌ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై జనవరి చివరివారం నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు గురువారం జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని