లద్దాఖ్‌ సరిహద్దు చైనాకు అతిముఖ్యం

లద్దాఖ్‌ సెక్టార్‌లో చైనాకు ఉన్న ఆర్థిక, వ్యూహాత్మక అవసరాలే సరిహద్దుల్లో ఆ దేశ సైన్యం ఆధిపత్య ధోరణికి కారణమని ఓ నివేదిక స్పష్టం చేసింది.

Published : 27 Jan 2023 05:04 IST

ఆ దేశ సైన్యం ఆధిపత్య ధోరణికి అదే కారణం
పర్యాటక అభివృద్ధే అసలు మందు
ఐపీఎస్‌ల నివేదిక

దిల్లీ: లద్దాఖ్‌ సెక్టార్‌లో చైనాకు ఉన్న ఆర్థిక, వ్యూహాత్మక అవసరాలే సరిహద్దుల్లో ఆ దేశ సైన్యం ఆధిపత్య ధోరణికి కారణమని ఓ నివేదిక స్పష్టం చేసింది. గత వారం జరిగిన డీజీపీ, ఐజీపీ సమావేశాల్లో ఐపీఎస్‌లు సమర్పించిన పలు నివేదికల్లో ఇదీ ఒకటి. ‘సరిహద్దు గుర్తించని ప్రదేశాల్లో ఆధిపత్యం చూపించడం ద్వారా ఆ భూభాగాన్ని తమదిగా చెప్పుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ (ఓబీఓర్‌), చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపీఈసీ)లతో భారత్‌కున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని మన వ్యూహాలకు కొత్త అర్థాన్ని ఇవ్వాలి. ఇప్పటివరకు లద్దాఖ్‌ ప్రాంతాన్ని ఒక ఆర్థిక వనరుగా చూడకుండా భారత్‌ పొరపాటు చేసింది. దీంతో 1962 నుంచి బఫర్‌జోన్‌ల రూపంలో కొంచెం కొంచెం కోల్పోతూ వస్తున్నాం. దీనిని మార్చాలి’ అని  నివేదికలో పేర్కొన్నారు. ‘సరిహద్దులో 400 మీటర్లు వెనక్కి వెళ్లడం ద్వారా చైనా సైనికుల నుంచి ఓ నాలుగేళ్లు శాంతి లభిస్తుందంటే అది మంచిదే’ అని ఓ సైనికాధికారి తనతో వ్యాఖ్యానించారని లద్దాఖ్‌లో విధుల్లో ఉన్న పోలీసు అధికారి నివేదికలో ప్రస్తావించడం గమనార్హం.

క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా భారత్‌ తన ప్రణాళికలను అమలు చేయాలని నివేదిక సూచించింది. దీనికి పర్యాటకాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ‘ఇక్కడి పండగలను, జాతరలను వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో లద్దాఖ్‌ వద్ద జాతీయస్థాయిలో నిర్వహించాలి. దెమ్‌చోక్‌లో ఉన్న చోటా కైలాష్‌ను ఆధ్మాత్మిక పర్యటక స్థలంగా మార్చాలి. సియాచిన్‌, దెస్పాంగ్‌ సానువుల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రాచీన సిల్క్‌ రూట్‌తో మనం అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు అవుతుంది.’ భారత సరిహద్దు రక్షణలో అత్యాధునిక సాంకేతికతను పెంచుకోవాలంటే ప్రభుత్వానికి ఆర్థికంగా భారమే..అయితే ఇక్కడ పర్యటకాన్ని పెంచడం ద్వారా ఆ ఖర్చులను భరించవచ్చు. ఆ వైపుగా ఆలోచనలు ఉండాలి’ అని నివేదిక స్పష్టం చేసింది.

వెబ్‌సైట్‌ నుంచి నివేదికల తొలగింపు

డీజీపీ, ఐజీపీల సమావేశంలో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చిస్తూ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలను అధికారక వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. వీటి ఆధారంగా మీడియాలో వివిధ కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ మార్పు జరగడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని