సంక్షిప్త వార్తలు(7)

నూతన గోప్యతా విధానాన్ని అంగీకరించని వినియోగదారులకు సైతం పూర్తి స్థాయి సేవలను అందిస్తామని కేంద్రప్రభుత్వానికి స్పష్టం చేసిన నేపథ్యంలో.. అదే విషయాన్ని జనబాహుళ్యంలో విరివిగా ప్రచారం చేయాలని వాట్సప్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated : 02 Feb 2023 05:59 IST

 కేంద్రానికి మీరు చెప్పిన విషయాన్ని ప్రచారం చేయండి

వాట్సప్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు

దిల్లీ: నూతన గోప్యతా విధానాన్ని అంగీకరించని వినియోగదారులకు సైతం పూర్తి స్థాయి సేవలను అందిస్తామని కేంద్రప్రభుత్వానికి స్పష్టం చేసిన నేపథ్యంలో.. అదే విషయాన్ని జనబాహుళ్యంలో విరివిగా ప్రచారం చేయాలని వాట్సప్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు పర్యాయాల్లో ఐదు జాతీయ పత్రికల్లో ఈ విషయాన్ని ప్రకటనగా ఇవ్వాలని ఆ సంస్థకు సూచించింది. వాట్సప్‌ నూతన గోప్యతా విధానంపై దాఖలైన ఓ పిటిషన్‌ను బుధవారం విచారించిన జస్టిస్‌ కె.ఎమ్‌. జోసెఫ్‌ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ వరకు అదే నిబంధనని పాటిస్తామని కోర్టుకు వాట్సప్‌ ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


కేరళ పాత్రికేయుడు సిద్దీఖి కప్పన్‌కు బెయిల్‌?

లఖ్‌నవూ: కేరళ పాత్రికేయుడు సిద్దీఖి కప్పన్‌ గురువారం బెయిల్‌ మీద విడుదలయ్యే అవకాశం ఉంది. ఆయనను విడుదల చేయడానికి ఒక్కొక్కటి లక్ష రూపాయలు విలువైన రెండు పూచీకత్తులను బుధవారం ఆయన తరఫు న్యాయవాది లఖ్‌నవూ కోర్టుకు సమర్పించారు. 2020లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ దళిత యువతిపై హత్యాచారం ఘటనకు సంబంధించి వార్తా నివేదనకు కప్పన్‌తో పాటు మరో ముగ్గురు వెళ్తుండగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మరణంపై హింసను ప్రేరేపించడానికే వెళ్తున్నారని పోలీసులు అనుమానించి వారిని అరెస్టు చేశారు. ఆయనకు నిషిద్ధ ఇస్లామిక్‌ సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాతో సంబంధాలున్నట్లు ఆరోపించారు. సెప్టెంబరులో కప్పన్‌ బృందానికి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ నగదు అక్రమ చలామణి కేసులో ఈడీ కేసు పెట్టడంతో జైలులోనే ఉన్నారు.


కోర్టులో దొంగలు పడ్డారు

పణజీ: గుర్తుతెలియని వ్యక్తులు జిల్లా కోర్టులో చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గోవాలోని పణజీలో జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కోర్టు వెనుక భాగంలోని కిటికీ విరగ్గొట్టి ఓ గదిలో ఉంచిన డబ్బును దొంగిలించారు. ‘‘కోర్టు కాపలాదారు భవనం ముందుభాగంలో ఉండటంతో.. దొంగలు వెనక భాగం నుంచి వచ్చారు. భవనంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులే ఈ పని చేసి ఉంటారు’’ అని పోలీసులు తెలిపారు.  దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ప్రవాసీయుల పిల్లల సంరక్షణపై అమెరికాతో ఒప్పందం చేసుకుంటారా?

కేంద్ర ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీం

దిల్లీ:  ప్రవాసీయులైన భార్యాభర్తలు విడిపోయిన సందర్భాల్లో వారి పిల్లల సంరక్షణకు సంబంధించి అమెరికాతో పరస్పర ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలను అన్వేషించే అంశంపై కేంద్రం స్పందనను సుప్రీంకోర్టు కోరింది. భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికాలో నివసిస్తున్నందున ఆ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 6 లోపు  తగిన స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖ, హోంశాఖలకు ఇటీవల నోటీసులు జారీచేసింది. ఓ ఎన్నారై జంటకు సంబంధించిన కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ఈ మేరకు సూచించింది. అనంతరం ఫిబ్రవరి 6వ తేదీకి విచారణను వాయిదా వేసింది.


భక్త తుకారం భార్యపై వ్యాఖ్యల వివాదం.. క్షమాపణలు చెప్పిన ధీరేంద్ర శాస్త్రి

ఛతర్‌పుర్‌: భక్త తుకారం భార్యకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ పండితుడు, మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్‌ ధామ్‌ ఆలయ ప్రముఖుడు ధీరేంద్ర శాస్త్రి క్షమాపణలు చెప్పారు. తాను అన్న మాటలకు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే మన్నించాలని కోరారు. భక్త తుకారం భార్య ఆయన్ను రోజూ కొట్టేదని ధీరేంద్ర చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘‘నా కథను చెప్పే క్రమంలో యథాలాపంగా చెప్పిన మాటలవి. తుకారం ఆదర్శనీయమై వ్యక్తి. ఆయన భార్య దృఢ వ్యక్తిత్వం కలిగిన మహిళ’’ అని ధీరేంద్ర శాస్త్రి చెప్పారు.


రోజుకు 72 లక్షల రిటర్నులు

దిల్లీ: పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలను అందించేలా ఆదాయపు పన్ను పోర్టల్‌ను మెరుగుపర్చినట్లు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 6.5 కోట్ల మంది  ఆదాయపు పన్ను పోర్టల్‌ ద్వారా రిటర్నులు దాఖలు చేశారు. ఒక రోజులో గరిష్ఠంగా 72 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. 2013-14లో రిటర్నులను ప్రాసెస్‌ చేయడానికి సగటున 93 రోజుల వరకూ పట్టేది. ఇప్పుడు కేవలం 16 రోజులే పడుతోంది. 45 శాతం వరకూ రిటర్నులను 24 గంటల్లోపే ప్రాసెస్‌ చేసినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల కోసం ‘నూతన ప్రామాణిక రిటర్నుల ఫారాన్ని’ తీసుకొచ్చే ప్రతిపాదనలూ ఉన్నాయని తెలిపారు.


మద్యం దుకాణాలను గోశాలలుగా మారుస్తా

మధ్యప్రదేశ్‌లో మహిళలపై దాడులకు మద్యమే కారణం
కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి వ్యాఖ్య

భోపాల్‌: కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి మధ్యప్రదేశ్‌లోని సొంత ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రామ నామంతో ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయని..రాష్ట్రంలో మహిళలపై దాడులకు మద్యపానమే కారణమని.. వెంటనే దాన్ని నియంత్రించకపోతే మద్య దుకాణాలను గోశాలగా మారుస్తానంటూ శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆమె నాలుగు రోజుల ఆలయాల సందర్శన కార్యక్రమం మంగళవారం ముగిసింది. ‘మధుశాల మే గోశాల’ పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ‘‘అక్రమంగా నడుస్తున్న మద్యం దుకాణాల దగ్గర 11 గోవులతో ప్రజలు సిద్ధంగా ఉండండి. రాముడి పేరుతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ రామ్‌ రాజ సర్కార్‌ ఆలయం పక్కనే మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ వల్లే భాజపా గెలుస్తోంది. ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడే విషయాలు బహిర్గతం చేయడం ప్రారంభిస్తాను’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.


చిత్ర వార్తలు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని