సంక్షిప్త వార్తలు(15)

కుటుంబ సభ్యుల హత్య, తనపై అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న దోషులను జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ బాధితురాలు బిల్కిస్‌ బానో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు ప్రత్యేక ధర్మాసనం.

Updated : 23 Mar 2023 06:52 IST

బిల్కిస్‌ బానో పిటిషన్‌ విచారణకు ప్రత్యేక ధర్మాసనం
అంగీకరించిన సుప్రీంకోర్టు

దిల్లీ: కుటుంబ సభ్యుల హత్య, తనపై అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న దోషులను జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ బాధితురాలు బిల్కిస్‌ బానో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం ఈ మేరకు హామీ ఇచ్చింది.


శక్తిమంతమైన న్యూట్రినోల ఆవిష్కరణ

దిల్లీ: శాస్త్ర పరిశోధనలో తొలిసారిగా ఓ పార్టికిల్‌ కొలైడర్‌ అత్యంత శక్తిమంతమైన న్యూట్రినో కణాలను వెలువరించింది. రెండు కణ పుంజాలు ఒకదానితో ఒకటి ఢీకొనగా న్యూట్రినోలు వెలువడ్డాయని అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల బృందం తెలిపింది. జెనీవాలోని సెర్న్‌లో నిర్వహించిన ఫార్వార్డ్‌ సెర్చ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (ఫేజర్‌) ద్వారా వీటిని కనుగొన్నారు. అంతర్జాతీయ శాస్త్రజ్ఞులు సెర్న్‌లోని లార్జ్‌ హేడ్రాన్‌ కొలైడర్‌లో ఫేజర్‌ను ఏర్పాటు చేశారు. విశ్వంలో అత్యధికంగా కనిపించే కణాలే న్యూట్రినోలు. వీటిని 1956లో కనుగొన్నారు. అప్పటి నుంచి తక్కువ శక్తి గల న్యూట్రినోలే పరిశోధనలకు లభ్యమవుతున్నాయి. తాజాగా ఫేజర్‌ కనుగొన్న న్యూట్రినోలు ప్రయోగశాలలో ఇంతవరకు ఎన్నడూ లేనంత అధిక శక్తి కలిగిఉన్నాయి. అవి అంతరిక్షంలో సుదూరం నుంచి భూమిని తాకే న్యూట్రినోలను పోలి ఉన్నాయి. నక్షత్రాలు మండే విధం గురించి న్యూట్రినోల ద్వారా తెలుసుకోవచ్చు.


పాత మాస్కులతో కాలుష్యానికి కళ్లెం

దిల్లీ: వాడిపారేసిన మాస్కులు ఇక ఎందుకూ ఉపయోగపడవని భావిస్తే పొరపాటేనంటున్నారు ఆ శాస్త్రవేత్తలు. వాటిని వాయుకాలుష్యానికి కారకమయ్యే కార్బన్‌ డైఆక్సైడ్‌ను సంగ్రహించే ఉపకరణాలుగా మార్చవచ్చని నిరూపించింది అంతర్జాతీయ పరిశోధకుల బృందం. బెంగళూరులోని అలియన్స్‌ విశ్వవిద్యాలయ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సునందారాయ్‌ దీనికి నేతృత్వం వహించారు. పాత మాస్కులను ఉపయోగించి కార్బన్‌డైఆక్సైడ్‌ను పోగు చేసే సరికొత్త సాంకేతికతను వీరు అభివృద్ధిపరిచారు. మాస్కుల్లోని సూక్ష్మరంధ్రాలు, ఫైబర్‌కు నైట్రోజన్‌ మిశ్రమాన్ని జోడించడం ద్వారా కార్బన్‌ డైఆక్సైడ్‌ను గ్రహించే సామర్థ్యం వస్తుందని పరిశోధన పత్రంలో వెల్లడించారు. ద్రవ, వాయు, ఘనపదార్థాల ఉపరితలాల్లోని అణువులను ఈ మాస్కులు శోషించుకుంటాయి.  


ధూమపానాన్ని మాన్పించే సిగిబడ్‌

దిల్లీ: ధూమపాన దురలవాటును మాన్పించే సిగిబడ్‌ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఐఐటీ దిల్లీ పూర్వ విద్యార్థి  ప్రతీక్‌ శర్మ. ఈ పరికరం ప్రపంచంలోనే మొట్టమొదటిదని చెబుతున్నారు. బుధవారం మార్కెట్‌లోకి విడుదల చేశారు. సిగిబడ్‌.. సిగరెట్‌ పొగ నుంచి 80 శాతం తారు, నికోటిన్‌లను పరిహరిస్తుంది. దీన్ని వాడటం వల్ల మూడు నెలల్లోనే ధూమపాన అలవాటుకు స్వస్తి చెప్పగలుగుతారని ఆయన వివరించారు. మానవ ఆరోగ్యంపై వాయు కాలుష్య దుష్ప్రభావాన్ని తొలగించడానికి ప్రతీక్‌ ఐఐటీ దిల్లీలో పరిశోధనలు చేశారు. దీనికోసం నానో ఫైబర్‌ సాంకేతికతను అభివృద్ధి చేసి 2017లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ జాతీయ అంకుర అవార్డును స్వీకరించారు.  3నెలలపాటు సిగిబడ్‌లను వాడి ధూమపానానికి స్వస్తి చెప్పవచ్చునని ప్రతీక్‌ శర్మ చెప్పారు.


సమన్లపై హాజరైతే కస్టడీకా?

కొన్ని ట్రయల్‌ కోర్టుల తీరును ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీ: సమన్లపై విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన నిందితులను దర్యాప్తు సంస్థల కస్టడీకి, రిమాండుకు కొన్ని ట్రయల్‌ కోర్టులు అప్పగించడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు సమయంలో నిందితుల అరెస్టు అవసరం లేదని దర్యాప్తు సంస్థలు వదిలేసిన కేసుల్లో ఇలాంటి ఆదేశాలను కోర్టులు ఎలా ఇస్తాయని నిలదీసింది. కార్పొరేషన్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో తమ ముందస్తు బెయిలును అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నలుగురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘నిందితులు అరెస్టు విషయంలో సీబీఐకి భయపడటం లేదు. ట్రయల్‌ కోర్టుకు భయపడుతున్నారు. కోర్టు వారిని కస్టడీకి అప్పగించింది. అందుకే వారు కోర్టు రక్షణ కోరారు. వారి తలరాతను నిర్ణయించేటప్పుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని ధర్మాసనం ఈ నెల 20న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది.


‘వైవాహిక అత్యాచారం’ పిటిషన్లపై మే 9న విచారణ

భార్య ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా శారీరక వాంఛల కోసం ఆమెను భర్త బలవంతపెట్టడాన్ని నేరంగా పరిగణించాలా..వద్దా...అనే వివాదంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మే 9న విచారణ జరగనుంది. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు ఈ కేసు విషయాన్ని బుధవారం సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ప్రస్తావించగా విచారణ తేదీ ఖరారైంది. ఈ కేసుకు సంబంధించిన వాదనల క్రమం, ఇతర అంశాల నమోదు పూర్తైందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సమాధానం కూడా సిద్ధంగా ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వెల్లడించగా విచారణను మే 9న చేపట్టనున్నట్లు ధర్మాసనం పేర్కొంది.


పార్టీల గుర్తింపుపై ఈసీ సమీక్ష

ఎన్‌సీపీ, సీపీఐల హోదాపై విచారణ

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి తర్వాత ఎన్నికల కమిషన్‌ మళ్లీ వివిధ రాజకీయ పార్టీల గుర్తింపును సమీక్షించడం పునఃప్రారంభించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల పనితీరు ఆధారంగా మొత్తం ఎనిమిది జాతీయ పార్టీల గుర్తింపుపై విచారిస్తోంది. అందులో భాగంగా ఎన్‌సీపీ, సీపీఐల వాదనలు వినడం మొదలుపెట్టింది. 1968 నాటి ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్‌ మరియు కేటాయింపు) ఉత్తర్వులలోని పేరాలు 6ఎ, బి, సిల ఆధారంగా ఆరు గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వాదనలను కూడా ఎన్నికల కమిషన్‌ వినింది. 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్‌ టీఎంసీ, సీపీఐ, ఎన్‌సీపీలకు నోటీసులు జారీచేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత వాటి హోదాను ఎందుకు తగ్గించకూడదని అందులో ప్రశ్నించింది. అయితే, అప్పట్లో కొవిడ్‌ కారణంగా ఈ ప్రక్రియ అక్కడితోనే ఆగిపోయింది. గత సంవత్సరం నవంబరులో ఎన్నికల కమిషన్‌ దీన్ని పునరుద్ధరించింది. ఎన్‌సీపీ, సీపీఐల వాదనలను మంగళవారం వినింది. టీఎంసీని కూడా పిలిచినట్లు సమాచారం.


ఓషో ఆశ్రమం వద్ద ఉద్రిక్తత

పుణె: మహారాష్ట్రలోని పుణెలో దివంగత ఆధ్యాత్మిక గురువు ఓషో రజనీష్‌ ఆశ్రమం వద్ద బుధవారం ఉద్రిక్తత తలెత్తింది. ఆశ్రమ స్థలాల్లో కొన్నింటిని విక్రయించాలన్న యాజమాన్య కమిటీ ప్రణాళికల్ని నిరసిస్తూ దాదాపు 200 మంది అనుచరులు ఈ ఆశ్రమంలోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించారు. వీరంతా ‘సన్యాస మాల’లు ధరించారు. కోరేగాం ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న ‘ఓషో అంతర్జాతీయ ఫౌండేషన్‌’ (ఓఐఎఫ్‌)కు, ఓషో అనుచరుల్లో ఓ వర్గానికి మధ్య కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది.


జంతర్‌మంతర్‌లో రైల్వే లోకోపైలట్ల ధర్నా

ఈనాడు, దిల్లీ: అనేక సంవత్సరాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ ఆల్‌ ఇండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ బుధవారం ఇక్కడి జంతర్‌మంతర్‌లో పెద్దఎత్తున ధర్నా చేపట్టింది. కేరళ సీపీఎం ఎంపీ వి.శివదాసన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇందులో లోకో స్టాఫ్‌ అసోసియేషన్‌ సెంట్రల్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఎన్‌.ప్రసాద్‌, సెక్రెటరీ జనరల్‌ కేసీ జేమ్స్‌, నార్తన్‌ రైల్వే జనరల్‌ సెక్రెటరీ పదం సింగ్‌లతోపాటు వేలాది మంది లోకోపైలట్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీకరించడంలేదని చెబుతున్నప్పటికీ అన్ని ఉద్యోగాలనూ అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌లకు అప్పగిస్తున్నట్లు ఇందులో మాట్లాడిన వక్తలు ఆరోపించారు. 128 రైల్వేస్టేషన్లు, 150 రైళ్లు మానిటైజ్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎత్తులు వేస్తున్నట్లు ఆరోపించారు. రైల్వేలో ఏటా 35వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుంటే కేవలం 5వేల పోస్టులు మాత్రమే భర్తీచేస్తున్నట్లు తెలిపారు. ఎన్‌పీఎస్‌ విధానంలో కనీస పింఛనుకు గ్యారెంటీ లేకుండాపోయిందని పేర్కొన్నారు. 6వ వేతన సవరణ సంఘం సిఫార్సుల్లోని అలవెన్సులను ఇప్పటికీ ఇవ్వలేదని తెలిపారు. పనిభారానికి తగ్గట్లు వేతనాలు పెంచాలని డిమాండ్‌చేశారు.


యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, దిల్లీ: గ్రామీణాభివృద్ధికి సుస్థిర పరిష్కార మార్గాలను చూపే 13 నెలల ఫెలోషిప్‌ ప్రోగ్రాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి భారతీయులతోపాటు నేపాల్‌, భూటాన్‌ పౌరులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైనవారు  వైద్యం, గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రత, పర్యావరణ సంరక్షణ, విద్య, నీరు, సాంకేతికత, మహిళా సాధికారత, స్వయం పాలన, సామాజిక పారిశ్రామిక విధానం, సంప్రదాయ కళలు, ప్రత్యామ్నాయ ఇంధనం వంటి అంశాల్లో స్వీయ ఆసక్తిని బట్టి ఏదో ఒక దానిపై పని చేయాల్సి ఉంటుంది. యువత ఆకాంక్షలు, వారి శక్తి సామర్థ్యాలకు మధ్య ఉన్న అగాధాన్ని యూత్‌ ఫర్‌ ఇండియా ప్రోగ్రాం భర్తీ చేస్తుందని ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఎండీ, సీఈవో సంజయ్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు. ఆసక్తిగలవారు ్త్మ్మ్ప(://్వ్న్య4.i-/్ప౯. లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.  2023 అక్టోబరు 1కి ముందు డిగ్రీ పూర్తి చేసిన 21 నుంచి 32 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.


రాజ్‌నాథ్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

దిల్లీ: రాహుల్‌ గాంధీ గురించి ఈ నెల 13వ తేదీన లోక్‌సభలో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌పై కాంగ్రెస్‌ సభాహక్కుల ఉల్లంఘన నోటీసిచ్చింది. కాంగ్రెస్‌ విప్‌ మాణికం ఠాగూర్‌ బుధవారం స్పీకరు ఓం బిర్లాను కలిసి ఈ నోటీసు అందజేశారు. ‘పార్లమెంటు బడ్జెట్‌ మలి విడత సమావేశాలు ప్రారంభమైన రోజున ఎటువంటి నోటీసు ఇవ్వకుండా రాహుల్‌ గాంధీ పరువుకు భంగం కలిగేలా రాజ్‌నాథ్‌ మాట్లాడారు. లోక్‌సభ నిబంధన 223 కింద ఈ నోటీసు ఇస్తున్నాం. ఆయనపై చర్యలు తీసుకోండి’ అని ఠాగూర్‌ కోరారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, విదేశీ శక్తులు జోక్యం చేసుకోవాలని లండన్‌లో రాహుల్‌ వ్యాఖ్యానించారని రాజ్‌నాథ్‌ ఆ రోజు సభలో పేర్కొన్నారు. రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండు చేశారు.


ఉపాధి హామీ వేతనాలను వెంటనే చెల్లించాలి

ఉపాధి హామీ సంఘర్ష్‌ మోర్చా డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న కూలీలు, మేట్లు, పర్యవేక్షకులు, కార్యక్రమానికి సంబంధించిన ఇతర అధికారులకు వెంటనే వేతనాలను చెల్లించాలని ఉపాధి హామీ సంఘర్ష్‌ మోర్చా నాయకులు డిమాండు చేశారు. ఈ పనులకు సంబంధించిన చెల్లింపుల ఆలస్యం, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మోర్చా ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో గత 26 రోజులుగా ధర్నా జరుగుతోంది. బుధవారం ధర్నాలో మోర్చా నాయకులు మాట్లాడుతూ.. వేతనాల పంపిణీలో తరచూ మార్పులు చేయకుండా కచ్చితమైన విధానాన్ని పాటించాలని డిమాండు చేశారు. ఆయా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రతినిధి బృందం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి శైలేష్‌ కుమార్‌, సంయుక్త కార్యదర్శి అమిత్‌ కటారియాను బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించింది.


11.5 కోట్ల ఇళ్లకు తాగునీటి సరఫరా
జల్‌ జీవన్‌ మిషన్‌ లక్ష్యం మేరకు పనులు
అధికారిక గణాంకాలు వెల్లడి

దిల్లీ: దేశంలో 11.5 కోట్ల ఇళ్లకు నేరుగా పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే 1.53 లక్షల గ్రామాలకు రక్షిత నీటి సరఫరా సదుపాయం ఉంది. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 2024నాటికి ప్రతి ఒక్కరికీ కనీసం 55 లీటర్ల నీటిని సరఫరా చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకోగా మార్చి 21వ తేదీ నాటికి ఈ ఫలితాలు సాధించినట్లు అధికారికంగా వెల్లడించిన సమాచారంలో పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తన కృషిని రెట్టింపు చేసినట్లు అందులో పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం రక్షిత నీటి సరఫరాకు రూ.70వేల కోట్లు కేటాయించింది. 2018-19లో రూ.5,500 కోట్లు కేటాయించారు. అంటే తాగునీటి సరఫరాకి దాదాపు 12 రెట్లు అధికంగా నిధుల చేయడం గమనార్హం. భారీగా నిధులు విడుదల చేయడంతో తాగునీటికి ఇబ్బంది పడే జిల్లాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నీటి సరఫరా చేసే సదుపాయాన్ని పెద్ద ఎత్తున కల్పించడం సాధ్యమైంది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే 9.34లక్షల అంగన్‌ వాడీ కేంద్రాలకు నీటి సరఫరా సదుపాయం కల్పించారు. అంటే అంతకుముందుతో పోలిస్తే ఇది 37శాతం అధికం. అలాగే 9.02లక్షల పాఠశాలలకు (18శాతం ఎక్కువ) నీటిని పంపిణీ చేస్తున్నారు.  


సరిహద్దు సమస్య తీవ్రమైనదే.. కానీ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదు
చైనా తాత్కాలిక రాయబారి స్పష్టీకరణ

దిల్లీ: భారత్, చైనాల మధ్య సరిహద్దు సమస్య తీవ్రమైనదైనా యుద్ధాన్ని రెండు దేశాలూ కోరుకోవడం లేదని మన దేశంలో చైనా తాత్కాలిక రాయబారి మా జియా స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యపై ఒక అవగాహనకు రావడం ఎంతో కష్టంతో కూడుకున్నదని పేర్కొన్నారు. బుధవారం దిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. రెండు దేశాలూ సీనియర్‌ కమాండర్‌ స్థాయిలో సరిహద్దులపై చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. వివాదం తేలకున్నా రెండు దేశాలు యుద్ధానికి దిగబోవని పేర్కొన్నారు. 


సంతోషం, సంపద ప్రతిఒక్కరికీ దక్కాలి

- నరేంద్ర మోదీ

దేశ ప్రజలందరికీ సంప్రదాయ నూతన సంవత్సర ఆరంభ శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా ప్రతిఒక్కరి జీవితం సంతోషం, సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా.


దిద్దుబాటు చర్యలు చేపట్టే విధాన రూపకర్తలు కావాలి

  - కౌశిక్‌ బసు

2022 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు కాస్త పుంజుకున్నట్లు భారత ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అది వాస్తవమే. అయితే 2013తో పోలిస్తే పెట్టుబడుల రేటు గణనీయంగా తగ్గినట్లు అదే డేటా స్పష్టం చేస్తోంది. ఉద్యోగాల సృష్టి, దీర్ఘకాలిక వృద్ధికి అది ప్రతికూలం. ఈ విషయాన్ని అర్థం చేసుకునే అధికారులు మనకున్నారు. ఇప్పుడు కావాల్సింది- దిద్దుబాటు చర్యలు చేపట్టే విధాన రూపకర్తలే.  


ఫిన్లాండే మెరుగా?

- అభిషేక్‌ సింఘ్వీ

ప్రపంచంలోకెల్లా ఫిన్లాండ్‌ అత్యంత సంతోషదాయక దేశమని సర్వేలు చెబుతున్నాయి. కానీ- కుంగుబాటు, ఆ తరహా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారి సంఖ్య అక్కడి జనాభాలో 7%గా ఉంది. భారత్‌లో అలాంటి వారు 4.5% మాత్రమే. మరి ఫిన్లాండ్‌ నిజంగా సంతోషదాయక దేశమా?  


ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసుకుందాం

- ఆంటోనియో గుటెరస్‌

ల సంబంధిత విపత్తులు గత దశాబ్ద కాలంలో రెట్టింపునకు మించి పెరిగాయి. వాటిని తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉన్న దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ విషయంలో తక్షణ చర్యలు అవసరం. ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేలా ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను బలోపేతం చేసుకుందాం.


చిత్ర వార్తలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని