కక్ష్యలోకి 36 ఉపగ్రహాలు.. ఇస్రో ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోమారు సత్తా చాటింది. ఇస్రో ప్రయోగించిన ఎల్‌వీఎం-3 వాహకనౌక.. వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

Updated : 27 Mar 2023 05:37 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోమారు సత్తా చాటింది. ఇస్రో ప్రయోగించిన ఎల్‌వీఎం-3 వాహకనౌక.. వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు 5,805 కేజీల పేలోడ్‌తో ఎల్‌వీఎం-3 వాహకనౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహాలను 450 కి.మీ.ల వృత్తాకార కక్ష్యలో 87.4 డిగ్రీల వంపుతో విజయవంతంగా వదిలిపెట్టింది. రాకెట్‌ బయలుదేరిన 9 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యను చేరుకోగా 20వ నిమిషం నుంచి ఉపగ్రహాలను కక్ష్యలో పెట్టడం ప్రారంభించింది. ఈ దశలో సీ25 స్టేజ్‌ అద్భుతంగా పనిచేసిందని ఇస్రో పేర్కొంది. ఉపగ్రహాలు ఒకదానినొకటి ఢీకొనకుండా నిర్దేశిత సమయాంతరాల్లో వాటిని విడిచిపెట్టింది. అన్ని ఉపగ్రహాలనూ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు తొమ్మిది దశల్లో 1:27 గంటల సమయం పట్టింది. ప్రయోగం విజయవంతమైన అనంతరం కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు.


ఇస్రోకు మైలురాయి

ఎల్‌వీఎం-3 ప్రయోగం ఇస్రో ప్రయాణంలో మైలురాయి. వన్‌వెబ్‌కు చెందిన రెండు వరుస ప్రయోగాలను విజయవంతం చేశాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని నిర్వహించగలమన్న నమ్మకం కలిగింది.

సోమనాథ్‌, ఇస్రో ఛైర్మన్‌


ఎన్‌ఎస్‌ఐఎల్‌, ఇస్రోకు గర్వకారణం

ఈ విజయం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌), ఇస్రో సంస్థలకు గర్వకారణం. మా సామర్థ్యాలను విశ్వసించినందుకు వన్‌వెబ్‌కు ధన్యవాదాలు. ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు.

రాధాకృష్ణన్‌, ఛైర్మన్‌, ఎండీ, ఎన్‌ఎస్‌ఐఎల్‌


వన్‌వెబ్‌ టారిఫ్‌లుచౌకగా మాత్రం ఉండవు
సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌

దిల్లీ: భారత్‌లో టెలికాం టారిఫ్‌లు అత్యంత తక్కువగా ఉన్నాయని, వాటితో సమానంగా మాత్రం వన్‌వెబ్‌ టారిఫ్‌లు ఉండకపోవచ్చని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ ఆదివారం వెల్లడించారు. తమ ఛార్జీలు పాశ్చాత్య దేశాల మొబైల్‌ సేవల రేట్లతో సమానంగా ఉండొచ్చని తెలిపారు. ఒక గ్రామంలోని 30-40 గృహాలు కలిపి వినియోగించుకుంటే అందుబాటు ధరల్లో లభించొచ్చన్నారు. ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. తాజా ప్రయోగంతో వన్‌వెబ్‌ కాన్‌స్టెలేషన్‌ సంఖ్య 618 శాటిలైట్లకు చేరింది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు