ఏప్రిల్‌ 22లోగా బంగ్లా ఖాళీ చేయండి.. రాహుల్‌కు నోటీసు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన ఆయన అధికార నివాసాన్ని కూడా కోల్పోబోతున్నారు.

Published : 28 Mar 2023 05:24 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన ఆయన అధికార నివాసాన్ని కూడా కోల్పోబోతున్నారు. 12- తుగ్లక్‌లేన్‌లోని అధికార బంగ్లాను ఏప్రిల్‌ 22లోగా ఖాళీ చేయాలంటూ రాహుల్‌కు లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రతిని అన్ని విభాగాలకూ పంపించారు. ఈ పరిణామంతో భాజపా-కాంగ్రెస్‌ మధ్య పోరు మరింత హోరెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ సభ్యుడిగా రాహుల్‌కు ఉండే ప్రయోజనాలన్నింటినీ అధికారులు పునఃపరిశీలిస్తున్నారు. కోర్టులో శిక్షపడిన నేపథ్యంలో రాహుల్‌.. లోక్‌సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. అందువల్ల- నిబంధనల ప్రకారం నెలరోజుల్లోపు అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. రాహుల్‌గాంధీ మరికొంత సమయం అడిగితే లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ ఆ విజ్ఞప్తిని పరిశీలించి, తగిన కారణాలుంటే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. 11 మంది సభ్యులున్న కమిటీకి భాజపా ఎంపీ సి.ఆర్‌.పాటిల్‌ నేతృత్వం వహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని