జాతీయ గీతానికి అగౌరవం కేసులో మమతకు లభించని ఉపశమనం

జాతీయ గీతాన్ని అగౌరవపరిచారంటూ దాఖలైన కేసులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఛైర్‌పర్సన్‌ మమతా బెనర్జీకి బాంబే హైకోర్టులో ఉపశమనం లభించలేదు.

Published : 30 Mar 2023 05:53 IST

ముంబయి: జాతీయ గీతాన్ని అగౌరవపరిచారంటూ దాఖలైన కేసులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఛైర్‌పర్సన్‌ మమతా బెనర్జీకి బాంబే హైకోర్టులో ఉపశమనం లభించలేదు. ఆమెపై వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తునకు ఆదేశించిన దిగువ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఏకసభ్య ధర్మాసనం బుధవారం తిరస్కరించింది. ఈ కేసును మేజిస్ట్రేట్‌ కోర్టుకు తిప్పిపంపుతూ సెషన్స్‌కోర్టు జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలన్న మమత పిటిషన్‌ను జస్టిస్‌ అమిత్‌ బోర్కర్‌ తోసిపుచ్చారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే మమతా బెనర్జీపై దాఖలైన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా ముంబయి పోలీసులను మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశించింది. 2021లో ముంబయిలోని యశ్వంతరావు చవాన్‌ ఆడిటోరియంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. వేదికపై కూర్చున్న మమతా బెనర్జీ జాతీయ గీతాలాపన ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా లేచి నిలుచున్నారని, గీతాలాపన మధ్యలోనే ఆ ప్రాంగణాన్ని వీడి వెళ్లిపోయారని ఆరోపిస్తూ వివేకానంద గుప్త అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ గీతానికి అవమానం జరిగిందన్న ఆ ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది మార్చిలో న్యాయస్థానం మమతకు సమన్లు జారీ చేయడంతో పాటు ఫిర్యాదుపై దర్యాప్తునకు ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు