కన్నూర్‌లో నిలిచి ఉన్న ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో మంటలు

కేరళలోని కన్నూర్‌ స్టేషన్లో నిలిచి ఉన్న అలప్పుజ-కన్నూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.

Published : 02 Jun 2023 04:43 IST

కన్నూర్‌: కేరళలోని కన్నూర్‌ స్టేషన్లో నిలిచి ఉన్న అలప్పుజ-కన్నూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. మంటల్లో బోగీ పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ బోగీని రైలు నుంచి వేరు చేశారు. దగ్గర్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి రైల్లోకి వెళ్లిన తర్వాత మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఇది ఉద్దేశపూర్వక ఘటనా..? కాదా..? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనాస్థలిని నిఘా మండలి (ఐబీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందాలు పరిశీలించి అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలో ఏప్రిల్‌ 2న కూడా ఈ తరహా ఘటన జరిగింది. అప్పట్లో అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆరోజు రాత్రి ఇదే రైలు కోజికోడ్‌ నగరాన్ని దాటి కోరపుజ రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికుడిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. ఆ ఘటనలో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. తాజా రైలు ఘటనపై అధికార వామపక్ష సర్కారును కాంగ్రెస్‌, భాజపా తప్పుపట్టాయి. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో సమగ్రంగా దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశాయి. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మతపరమైన ఉగ్ర ముఠాలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని భాజపా ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని