శ్రీనగర్ పాఠశాలలో బుర్ఖాలకు అభ్యంతరం
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో విశ్వభారతి హయ్యర్ సెకండరీ స్కూలు యాజమాన్యం అబయ (బుర్ఖా/పొడవాటి బాహ్యవస్త్రం)తో విద్యార్థినుల ప్రవేశానికి అభ్యంతరం చెప్పడం ఆందోళనకు దారి తీసింది.
నిరసనకు దిగిన విద్యార్థినులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో విశ్వభారతి హయ్యర్ సెకండరీ స్కూలు యాజమాన్యం అబయ (బుర్ఖా/పొడవాటి బాహ్యవస్త్రం)తో విద్యార్థినుల ప్రవేశానికి అభ్యంతరం చెప్పడం ఆందోళనకు దారి తీసింది. గురువారం పాఠశాల పరిపాలన భవనం ఎదుట విద్యార్థినులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘‘మీరు అబయలతో వస్తే మదరసాలకు వెళ్లండి.. ఇక్కడికి రానివ్వం. వాటితో పాఠశాల వాతావరణం పాడవుతోంది’’ అని యాజమాన్యం తమతో చెప్పినట్లు ఓ విద్యార్థిని తెలిపారు. స్కూలు ప్రిన్సిపాల్ మెమ్రోజ్ షఫీ దీనిపై వివరణ ఇస్తూ.. ‘‘మీరు ఇంటి నుంచి ఎలాగైనా రండి. స్కూలు ఆవరణలో మాత్రం అబయ వద్దని చెప్పాం. స్కూలు యూనిఫాం నిబంధనలకు అనుగుణంగా పొడవైన తెల్లటి హిజాబ్ లేదా పొడవైన దుపట్టా ధరించవచ్చని చెప్పాం. ఇందుకు విరుద్ధంగా వివిధ డిజైన్లతో రంగు రంగుల బుర్ఖాల్లో వస్తున్నారు’’ అని తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో ‘హిజాబ్’.. స్కూలు గుర్తింపు రద్దు
మధ్యప్రదేశ్ దమోహ్ పట్టణంలోని గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూలు తమ విద్యార్థులకు యూనిఫాంలో భాగంగా తల చుట్టూ కట్టే హిజాబ్ లాంటి వస్త్రధారణను పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ స్కూలుపై కేసు నమోదు చేసి, గుర్తింపును రద్దు చేసింది. రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్ర గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు తీసుకొంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.