యూట్యూబ్‌ తొలగించిన వీడియోలు 22.5 లక్షలు

సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను గత ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య యూట్యూబ్‌ తొలగించింది.

Published : 27 Mar 2024 04:27 IST

అమెరికా, రష్యా కంటే మనవే ఎక్కువ
2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక గణాంకాలు

దిల్లీ: సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను గత ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య యూట్యూబ్‌ తొలగించింది. ఈ విషయంలో 30 దేశాల్లో అగ్రస్థానంలో మన దేశం ఉంది. జాబితాలో రెండో స్థానంలో సింగపూర్‌ ఉంది. ఆ దేశానికి చెందిన 12.43 లక్షల వీడియోలను తొలగించారు. అమెరికా (7.88 లక్షలు), ఇండొనేసియా (7.70 లక్షలు), రష్యా (5.16 లక్షలు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీడియోలను అప్‌లోడ్‌ చేసిన దేశాల ప్రాతిపదికన గణాంకాలు నిర్ణయించారు. ప్రపంచం మొత్తంమీద 90 లక్షలకు పైగా వీడియోలను 2023లో తొలగించారు. వీటిలో 96% దృశ్యాలను మనుషుల కంటే ముందుగా యంత్రాలే గుర్తించడం విశేషం. ప్రమాదకరమైన అంశాలు, పిల్లల భద్రత, హింసాత్మకమైన/ గ్రాఫిక్‌ జోడించిన అంశాలు, నగ్న/ అశ్లీల దృశ్యాలు, తప్పుడు సమాచారం.. ఇలాంటివాటిని యూట్యూబ్‌ తొలగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2.05 కోట్ల ఛానళ్లను అక్టోబరు-డిసెంబరు మధ్య యూట్యూబ్‌ తొలగించింది. ఒక ఛానల్‌ను నిలిపివేసినప్పుడు దానిలో ఉన్న వీడియోలను తొలగిస్తారు. ఆ రకంగా చెప్పాలంటే 9,55,34,236 వీడియోలను తీసేసినట్లు లెక్క. 90 రోజుల గడువులో మూడుసార్లు మార్గదర్శకాలు ఉల్లంఘించినా, తీవ్రమైన దుష్ప్రవర్తనకు ఒక్కసారి పాల్పడినా ఆ ఛానల్‌ను తొలగిస్తున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని