‘టీఆర్‌పీ’ కేసులో అర్ణబ్‌ గోస్వామికి ఊరట

టీఆర్‌పీ కుంభకోణం కేసులో అర్ణబ్‌ గోస్వామికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయదలిస్తే మూడు రోజుల ముందు నోటీసులివ్వాలని బాంబే హైకోర్టు ముంబయి

Published : 24 Mar 2021 18:52 IST

ముంబయి: టీఆర్‌పీ కుంభకోణం కేసులో అర్ణబ్‌ గోస్వామికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయదలిస్తే మూడు రోజుల ముందు నోటీసులివ్వాలని బాంబే హైకోర్టు ముంబయి పోలీసులను ఆదేశించింది.   

రిపబ్లిక్‌ టీవీతో పాటు మరో రెండు మరాఠా టీవీ ఛానెళ్లు నకిలీ టీఆర్‌పీ రేటింగ్‌లతో మోసాలకు పాల్పడుతున్నట్టు గతేడాది అప్పటి ముంబయి నగర పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌సింగ్‌ సంచలన విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కుంభకోణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఛార్జ్‌షీట్‌లో అర్ణబ్‌తో పాటు రిపబ్లిక్ టీవీ సిబ్బందిని ‘అనుమానితులు’గా పేర్కొనడం గమనార్హం. 

ఈ నేపథ్యంలో కేసును తమకు ఉపశమనం కల్పించాలని కోరుతూ అర్ణబ్‌, రిపబ్లిక్‌ టీవీ సిబ్బంది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ‘‘ఒకవేళ దర్యాప్తులో భాగంగా పిటిషనర్‌(అర్ణబ్‌)పై అరెస్టు లాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తే.. 72 గంటలు ముందుగానే ఆయనకు నోటీసులు’’ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో దర్యాప్తుపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. అంతేగాక, దర్యాప్తును 12 వారాల్లోగా పూర్తి చేయాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను జూన్‌ 28కి వాయిదా వేసింది. 

2018లో ఆత్మహత్య చేసుకున్న ఇంటీరియర్‌ డిజైనర్‌ అన్వయ్‌ నాయక్‌ కేసులో గతేడాది ముంబయి పోలీసులు అర్ణబ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని