Corruption Probe: ఆ అధికారి ఇల్లంతా బంగారమే.. మరుగుదొడ్డి కూడా..

రష్యాలో ఓ భారీ స్కాం బయటపడింది. 35 మందికిపైగా ట్రాఫిక్​ పోలీసులు ఇందులో భాగమైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే దర్యాప్తు బృందాలు.. కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారి ఇంటికి సోదాలకు వెళ్లినప్పుడు....

Published : 26 Jul 2021 02:06 IST

మాస్కో: రష్యాలో భారీ స్కాం బయటపడింది. 35 మందికిపైగా ట్రాఫిక్​ పోలీసులు ఇందులో భాగమైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే దర్యాప్తు బృందాలు.. కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారి ఇంటికి సోదాలకు వెళ్లినప్పుడు బయటపడిన కొన్ని దృశ్యాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. ఆయన ఇల్లంతా బంగారంతో పోతపోసినట్లు ఉండటమే ఇందుకు కారణం. విలాసవంతమైన ఇంట్లోని అనేక వస్తువులు బంగారంతో తయారుచేసినవే. బెడ్రూమ్‌, హాలు, కిచెన్‌లోని పలు వస్తువులతోపాటు.. ఆ ఇంట్లోని మరుగుదొడ్డిని కూడా ఆ అధికారి బంగారంతో కట్టించుకున్నాడు. అంతేకాదు దానికి మ్యాచింగ్‌గా ఫ్లోర్​ను కూడా ప్రత్యేక మార్బుల్​తో వేయించాడు. ఆ ఇల్లు, ఇంట్లోని వస్తువులను చూసిన దర్యాప్తు బృందం కంగుతింది.

నైరుతి రష్యాలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న స్టావ్రోపోల్​లో భూతల స్వర్గాన్ని తలపించే ఇల్లు అది. ఆ ఇంటి ముందు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇంట్లో ఉండే ఫర్నీచర్​, గోడకు ఉండే ఫ్రేమ్​లు, కుర్చీలు, కిచెన్​లో ఉండే అలమరాలు, ఇతర సామాగ్రి అంతా బంగారంతో ధగధగలాడుతున్నాయి. ఇంటీరియర్​ డెకరేషన్​ అంతా పుత్తడితోనే ఉండడం గమనార్హం. దర్యాప్తు బృందం ఆ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన 50 సెకెన్ల నిడివిగల వీడియో యూట్యూబ్​లో హల్​చల్​ చేస్తోంది. దీనిని అధికారులు జులై 20న ఆప్​లోడ్​ చేశారు. కాగా ఇప్పటివరకు ఈ వీడియోను 4 లక్షల మందికిపైగా వీక్షించారు.

ది మాస్కో టైమ్స్ నివేదిక ప్రకారం.. అలెక్సీ, అతని కింద ఉండే ఆరుగురు అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని వాహనాలకు ఫేక్​ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయా వాహనాలు స్టావ్రోపోల్​లో ఎలాంటి రుసుము చెల్లించకుండా సరుకు రవాణా చేయవచ్చు. ఈ క్రమంలోనే వారు భారీగా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. అదే కేసులో మరో 35 మంది హస్తం ఉందనే అనుమానులు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ కోసం వెళ్లిన పోలీసులు.. ఆ ఇంటిని చూసి షాకయ్యారు. ఈ ఆరోపణలు రుజువైతే అలెక్సీకి సుమారు 15ఏళ్ల  జైలు శిక్ష పడుతుందని స్థానిక మీడియోలో కథనాలు వెలువడ్డాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని