Prisoners Release: ఖైదీలకు ‘ప్రత్యేక విముక్తి’.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు

వివిధ నేరాల్లో జైలుశిక్ష అనుభవిస్తోన్న ఖైదీలకు (Prisoners) భారీ ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Published : 05 Jul 2022 22:23 IST

మూడు దశల్లో విడుదలకు సన్నాహాలు

దిల్లీ: వివిధ నేరాల్లో జైలుశిక్ష అనుభవిస్తోన్న ఖైదీలకు (Prisoners) భారీ ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా 50ఏళ్ల వయసుపైబడిన మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు జైలు జీవితం నుంచి ప్రత్యేక విముక్తి (Special Remission) కలిగించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఖైదీల సత్ప్రవర్తన ఆధారంగా వారి శిక్ష కాలాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్న కేంద్ర హోంశాఖ.. తద్వారా వేల మంది ఖైదీలకు ఉపశమనం కలుగుతుందని వెల్లడించింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఖైదీల శిక్షను తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

‘ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 50ఏళ్లుపైబడిన మహిళలు, ట్రాన్స్‌జండర్ల శిక్షను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. వీరితోపాటు సగానికి పైగా శిక్ష కాలాన్ని పూర్తిచేసుకున్న 60ఏళ్ల వయసు పైబడిన పురుషులతోపాటు వికలాంగులు ఈ ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా శిక్ష పూర్తైనప్పటికీ న్యాయస్థానం విధించిన జరిమానాలు చెల్లించలేని పేద, నిరుపేద ఖైదీలు (వాటిని మాఫీ చేయడం వల్ల) ప్రయోజనం పొందనున్నారు’ అని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 18 నుంచి 21ఏళ్ల వయసు కలిగిన యువఖైదీలకు గతంలో ఎటువంటి కేసులు లేనివారితోపాటు 50శాతం శిక్ష అనుభవించిన వారిని ఈ పథకం కింద శిక్షను తగ్గించేందుకు పరిశీలనలోకి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

ఈ ప్రత్యేక పథకానికి సంబంధించి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఇందుకు అర్హత కలిగిన వారిని మూడు దశల్లో అనగా.. ఆగస్టు 15, 2022, జనవరి 26, వచ్చేఏడాది ఆగస్టు 15 (2023)లలో విడుదలకు కసరత్తు చేయాలని సూచించింది. అయితే, మరణశిక్ష, జీవిత ఖైదుతోపాటు అత్యాచారం, ఉగ్రవాదం, వరకట్న మరణాలు, మనీ లాండరింగ్‌ కేసుల్లో శిక్ష అనుభవిస్తోన్న ఖైదీలకు ఈ పథకం వర్తించదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం.

ఇదిలాఉంటే, 2020 అధికారిక లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా జైళ్లు నిండిపోయి ఉన్నాయి. జైళ్ల మొత్తం సామర్థ్యం 4.03లక్షలు కాగా ప్రస్తుతం 4.78లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారు. మొత్తం ఖైదీల్లో దాదాపు లక్ష మంది మహిళలే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని