Jan Vishwas bill: చిన్న నేరాలను ‘క్రిమినల్‌’ పరిధి నుంచి తప్పించేందుకు కేంద్రం బిల్లు

చిన్న చిన్న నేరాలను క్రిమినల్‌ పరిధి నుంచి తప్పించడమే లక్ష్యంగా జన విశ్వాస్‌ పేరిట ఓ బిల్లును తీసుకొచ్చింది. మరింత అధ్యయనం కోసం జేపీసీకి పంపించారు.

Published : 22 Dec 2022 20:44 IST

దిల్లీ: చిన్న చిన్న నేరాలను క్రిమినల్‌ పరిధి నుంచి తప్పించడమే లక్ష్యంగా కేంద్రం ఓ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 42 చట్టాల్లోని 183 నిబంధనలను సవరించేందుకు గానూ జన విశ్వాస్‌ బిల్లు (Jan Vishwas bill) పేరిట కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ గురువారం లోక్‌సభలో దీన్ని ప్రవేశ పెట్టారు. సులభతర వాణిజ్య విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయితే, ఈ బిల్లును 31 మంది సభ్యులతో కూడిన జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీకి పరిశీలన నిమిత్తం పంపించారు.

బిల్లును ప్రవేశపెడుతూ.. దేశంలోని అనేక చట్టాలు ఉన్నాయని, అందులో చిన్న చిన్న నేరాలకు కూడా శిక్షలు ఉన్నాయని గోయల్‌ అన్నారు. వీటిపై ప్రజలు కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు.‘‘అయితే, ప్రజలను మనం విశ్వసించాలి. చిన్న చిన్న తప్పులను కూడా నేరాలుగా పరిగణించకూడదు. అందుకోసం జరిమానా చెల్లించేలా నిబంధనలు ఉండాలి’’ అని గోయల్‌ పేర్కొన్నారు. సులభతర వాణిజ్య విధానంలో భాగంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని గోయల్‌ అన్నారు. క్రిమినల్‌ పరిధి నుంచి చిన్న నేరాలను తప్పించడం వల్ల న్యాయవ్యవస్థపై సైతం భారం తగ్గుతుందని చెప్పారు. చైనాతో సరిహద్దు వివాదంపై సభ్యుల ఆందోళన నడుమ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లుపై మరింత అధ్యయనం అవసరం అని భావించిన నేపథ్యంలో జేపీసీకి పంపించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ మలి దఫా సమావేశాల్లో తమ నివేదికను కమిటీ సమర్పించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని