Groom: పెళ్లికొడుక్కి వింత అనుభవం.. రాత్రంతా నడిచి.. మూడు ముళ్లు వేసి

పెళ్లి మండపానికి వెళ్లేందుకు వరుడితోపాటు అతడి కుటుంబ సభ్యులు రాత్రంతా నడవాల్సి వచ్చింది. ఈ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో చోటు చేసుకుంది.

Published : 18 Mar 2023 01:56 IST

భువనేశ్వర్‌: ఓ వైపు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. వాహనాల సమ్మెతో మండపానికి వెళ్లే అవకాశం లేదు. దీంతో పెళ్లికొడుకుతోపాటు అతడి బంధువులు కాలినడక అందుకున్నారు. రాత్రంతా నడిచి.. ఎట్టకేలకు మండపానికి చేరుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో జరిగింది. అనుకున్న ముహూర్తానికే మూడు ముళ్లు వేసిన వరుడు.. తిరిగి వచ్చేందుకు కూడా వాహనాలు లేకపోవడంతో అత్తవారింట్లోనే ఉండాల్సి వచ్చింది.

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బుధవారం నుంచి ఒడిశాలో వాహన చోదకులు ఉద్యమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలను నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లికోసం ముందుగానే వాహనాలు బుక్‌ చేసుకున్నప్పటికీ యజమానులు రద్దు చేసుకున్నారు. దీంతో మగపెళ్లివారంతా కల్యాణ్‌ సింగ్‌పూర్‌ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి కాలినడకన పయనమయ్యారు. గురువారం సాయంత్రం బయల్దేరి శుక్రవారం ఉదయానికి వధువు ఇంటికి చేరుకున్నారు. పెళ్లయితే ఘనంగా జరిగింది కానీ, తిరిగి స్వగ్రామానికి చేరుకునేందుకు వధువు కుటుంబ సభ్యులకు అవకాశం లేకపోయింది. దీంతో వారంతా పెళ్లి కూతురు ఇంట్లోనే ఉండిపోయారు. వాహన చోదకులు స్ట్రైక్‌ను ఎప్పుడు విరమించుకుంటారా? అని ఎదురు చూస్తున్నామని.. ఆ తర్వాత వాహనాలు బుక్‌ చేసుకొని ఇంటికి వెళ్తామని వరుడి బంధువులు చెప్తున్నారు.

మరోవైపు వాహనాల బంద్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం దిగొచ్చి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని ‘ది డ్రైవర్‌ ఏక్తా మహాసంగ్‌’ స్పష్టం చేసింది. నిరసనలను విరమించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా, డీజీపీ ఎస్‌కే బన్సక్‌ డ్రైవర్లను కోరినప్పటికీ ఫలితం కనిపించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని