Lakhimpur Kheri Violence: ప్రధాని మోదీ.. లఖింపుర్‌కు రండి.. రైతుల బాధలు వినండి

లఖింపుర్‌ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించాలని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా.. ప్రధాని నరేంద్ర మోదీకి డిమాండ్‌ చేశారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నేడు లఖ్‌నవూ చేరుకోనున్న నేపథ్యంలో ప్రియాంక ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు...

Updated : 10 Aug 2022 16:59 IST

ప్రియాంకా గాంధీ డిమాండ్‌

లఖ్‌నవూ: లఖింపుర్‌ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించాలని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా డిమాండ్‌ చేశారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నేడు లఖ్‌నవూ చేరుకోనున్న నేపథ్యంలో ప్రియాంక ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. నిరసన ప్రదర్శనలో ఉన్న రైతులపై వాహనాలు దూసుకెళ్తున్న వీడియో చూపుతూ.. సంబంధిత మంత్రిని ఇంకా ఎందుకు తొలగించలేదో ప్రధాని దేశవాసులకు సమాధానం చెప్పాలన్నారు. నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదో కూడా తెలపాలని డిమాండ్‌ చేశారు. ‘మహోత్సవ్‌ కార్యక్రమ వేదికపై ఉన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుచేసుకోండి. ఏంటంటే.. మనకు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టింది రైతులే. దేశ రక్షణకు సరిహద్దుల్లో ఉంటోంది కర్షకుల బిడ్డలే. అన్నదాతలు నెలలుగా కష్టాలు పడుతున్నారు. వారి గొంతుకను వినిపిస్తున్నారు. కానీ, మీరు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో లఖింపుర్‌ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టారో.. ఎవరైతే ఈ దేశ ఆత్మనో.. వారి బాధలు వినండి. వారిని అర్థం చేసుకోండి. వారి రక్షణ మీ బాధ్యత’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు. అంతకుముందు కూడా మోదీ ప్రభుత్వంపై ప్రియాంక విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ‘ఎఫ్‌ఐఆర్‌ లేకుండా నన్ను 28 గంటలుగా నిర్బంధంలో ఉంచారు. కానీ, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదు. ఎందుకు?’ అని ప్రశ్నించారు. ఈ విషయంలో రాహుల్‌గాంధీ సైతం ప్రియాంకకు మద్దతుగా నిలిచారు.

రైతుల మృతదేహాలపై బుల్లెట్‌ గాయాలు లేవు..

లఖింపుర్‌ ఖేరి ఘటనలో మృతి చెందిన నలుగురు రైతుల మృతదేహాలపై ఎటువంటి బుల్లెట్‌ గాయాలు లేవని అధికారులు తెలిపారు. శవపరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్లు చెప్పారు. షాక్‌కు గురవడం, గాయాల కారణంగా తీవ్ర రక్తస్రావంతో వారు ప్రాణాలు కోల్పోయినట్లు తేలిందన్నారు. ఆదివారం లఖింపుర్‌ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులు సహా తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని