Essential Medicines: అత్యవసర ఔషధాల జాబితాలో స్టెంట్లు

గుండె నాళాల్లో అమర్చే స్టెంట్‌లను అత్యవసర ఔషధాల జాబితాలో చేరుస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటిషికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇవి మరింత చౌకగా అందుబాటులోకి రానున్నాయి.

Published : 21 Nov 2022 02:37 IST

దిల్లీ: గుండె పోటు బాధితులను ప్రాణాపాయం నుంచి రక్షించడంలో స్టెంట్లు ఎంతో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనరీ స్టెంట్‌లను అత్యవసర ఔషధాల జాబితాలో (NLEM) చేర్చుతూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో త్వరలోనే ఇవి మరింత చౌకగా లభ్యం కానున్నాయి.

కరోనరీ స్టెంట్‌ల వినియోగాన్ని సమీక్షించిన స్టాండింగ్‌ నేషనల్‌ కమిటీ ఆన్‌ మెడిసిన్‌ (SNCM).. వీటిని అత్యవసర ఔషధ జాబితాలో చేర్చాలంటూ నవంబర్‌ 6న కేంద్రానికి సిఫార్సు చేసింది. మెటల్‌ స్టెంట్‌లు (BMS), డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్‌లు (DES) రెండు విభాగాలనూ ఇందులో పొందుపరిచింది. అయితే, వీటిపై తుది ధరలను మాత్రం నేషనల్‌ ఫార్మా ప్రైసింగ్‌ అథారిటీ (NPPA) నిర్ణయించనుంది.

అయితే, వీటిని 2015లోనే అత్యవసర ఔషధాల జాబితాలో ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా చేర్చారు. ప్రస్తుతం నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సు ఆధారంగా ఇప్పటివరకు పరికరాలుగా ఉన్న స్టెంట్‌లను ‘ఔషధాలుగా’ గుర్తిస్తూ పూర్తిస్థాయిలో ఈ జాబితాలో చోటు కల్పించారు. క్యాన్సర్‌ను ఎదుర్కొనే ఔషధాలు, యాంటీబయాటిక్స్‌, వ్యాక్సిన్‌లు మొత్తంగా 34 ఔషధాలను చేరుస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ జాబితాలో 384 ఔషధాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని