Shashi Tharoor: ప్రధాని మోదీ ఇకనైనా మౌనం వీడాలి: శశిథరూర్‌

భాజపా మాజీ ప్రతినిధులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడాలని కాంగ్రెస్‌ నేత

Published : 12 Jun 2022 18:40 IST

దిల్లీ: భాజపా మాజీ ప్రతినిధులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడాలని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అన్నారు. తన మౌనం ద్వారా వారిని వెనకేసుకొస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశిథరూర్‌ మాట్లాడారు. ఇస్లామిక్‌ దేశాలతో స్నేహ బంధాన్ని కాపాడడానికి ఇకనైనా మోదీ మౌనం వీడాలన్నారు.

‘ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు దేశ అభివృద్ధి, శ్రేయస్సు, శాంతికి విఘాతం కలిగిస్తాయని ఆయనకు తెలుసు. దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్ అనే నినాదం సాకారం కావాలంటే ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాలి. భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆపాలి. అందుకోసం ఆయన దేశప్రజలకు బహిరంగంగా పిలుపునివ్వాలి’ అని మోదీని ఉద్దేశించి థరూర్ వ్యాఖ్యానించారు.

ఇస్లామిక్ దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని.. వాటిని మరింత బలోపేతం చేయడానికి భారత్‌ ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. అయితే, ఇటీవల భాజపా మాజీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ఆ సత్సంబంధాలు బలహీనపడే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశంలో దైవదూషణ చట్టాలు తీసుకొచ్చే అవసరం లేదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి విద్వేషపూరిత ప్రసంగాన్ని అరికట్టడానికి ఇప్పుడున్న చట్టాలు, సెక్షన్‌ 295ఏ లాంటివి సరిపోతాయని శశిథరూర్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని