Afghanisthan: తినడానికి, నిద్రపోవడానికే పుట్టలేదు.. నేనూ స్కూల్‌కెళ్లి చదువుకుంటా!

అఫ్గాన్‌లో ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తోంది. తాలిబన్లు కాబుల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు

Published : 24 Sep 2021 15:03 IST

కాబుల్‌: అఫ్గాన్‌లో ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తోంది. తాలిబన్లు కాబుల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు మూసివేశారు. తాజాగా దీనిపై తాలిబన్ల ప్రభుత్వం కొత్త ప్రకటనను విడుదల చేసింది. ‘‘దేశంలో ఉన్న మదర్సాలు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు పునఃప్రారంభం అవుతాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు (మగవారు మాత్రమే) హాజరు కావాల్సి ఉంటుంది’’ అని ఒక ప్రకటనను విడుదల చేశారు. అయితే, ఇందులో అమ్మాయిల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ ప్రకటన వెలువడిన తర్వాత విద్యార్థులందరూ (అబ్బాయిలు, అమ్మాయిలు) కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అమ్మాయిలను కూడా తిరిగి చదువుకోవడానికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. తాజాగా మహిళలు చదువుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఓ అమ్మాయి భావోద్వేగంగా మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అయింది.

‘‘దేశం కోసం ఏదైనా చేయాలంటే చదువు తప్పనిసరి. అది దేవుడిచ్చిన మంచి అవకాశం. పురుషులతోపాటు మహిళలకూ సమాన అవకాశాలు ఉన్నాయి. మా హక్కులను కాలరాసేందుకు అసలు తాలిబన్లు ఎవరు?’’అని ఈ వీడియోలో పేర్కొన్నారు. ‘‘ఈరోజు అమ్మాయిలే రేపు కాబోయే తల్లులు. అమ్మాయిలు చదువుకోకపోతే వారికి పుట్టే బిడ్డలకు ఏం నేర్పిస్తారు? నేను నవ తరానికి చెందిన యువతిని. నేను ఇంట్లో ఉండి తినడానికి, నిద్రపోవడానికి మాత్రమే పుట్టలేదు. నేను స్కూల్‌కు వెళ్లి చదువుకోవాలి. దేశాభివృద్ధికి ఎంతో కొంత కృషి చేయాలి’’ అని భావోద్వేగంతో ప్రసంగించారు. ‘‘చదువు లేకపోతే దేశం ముందుకు ఎలా సాగుతుందో ఊహించగలమా? అఫ్గాన్‌లోని ఏ ఒక్క మహిళ విద్యనభ్యసించకపోతే వారి తర్వాత తరాలకు ఏం నేర్పిస్తారు. మేము చదువుకోకపోతే దేశంలో మాకు విలువే లేకుండా పోతుంది’’ అని ఆమె ఆవేదనను వెలిబుచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని