Corona: కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి..40వేలపైనే కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో స్వల్పహెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

Published : 31 Jul 2021 09:46 IST

46 కోట్ల మార్కు దాటిన టీకా డోసులు పంపిణీ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో స్వల్పహెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 17,76,315 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 41,649 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే ఆరు శాతం మేర తగ్గాయి. నిన్న మరో 593 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసులు 3.16 కోట్లకు చేరగా.. 4.23 లక్షల మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ఇటీవల నాలుగు లక్షల దిగువకు చేరిన క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 4,08,920 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.29 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. నిన్న 37వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.07కోట్లకు చేరాయి. నిన్న 52,99,036 మంది టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు సంఖ్య 46కోట్ల మార్కును దాటింది.

కేరళలో 20వేల కేసులు.. కర్ణాటకలో ఆంక్షలు..

కేరళలో మరోరోజు 20వేలపైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసులు 33.70లక్షలుగా ఉన్నాయి.  దాంతో వారాంతపు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే  ప్రకటించింది. ఆ ఆంక్షలు ఈ రోజు నుంచి ఆమల్లోకి వస్తాయి. తాజాగా మహారాష్ట్రలో 6,600 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల్లో ఈ రెండురాష్ట్రాల వాటానే సగానికిపైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోపక్క అకస్మాత్తుగా కరోనా కేసులు పెరగడం.. సరిహద్దు రాష్ట్రాలు కేరళ, మహరాష్ట్రలో వైరస్ విజృంభణతో కర్ణాటకలో వైరస్ భయాలు పెరిగాయి. దాంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ఆ రాష్ట్రానికి వచ్చేవారికి నెగెటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని