India Corona: మళ్లీ 2 వేలకు పైగా కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న దిల్లీ, ముంబయి..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మరోసారి రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రధాన నగరాలై దిల్లీ, ముంబయిలో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.

Published : 20 Apr 2022 10:11 IST

పెరుగుతోన్న క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయిలో ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* మంగళవారం 4.21 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,067 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దిల్లీ(632), కేరళ(488) ప్రభావమే మొత్తం కొత్త కేసులపై ఎక్కువగా కనిపిస్తోంది. ముంబయిలో మార్చి 2 తర్వాత అత్యధిక కేసులు(85) నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, మహారాష్ట్ర, మిజోరం వంటి రాష్ట్రాలు కొవిడ్ కట్టడి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మంగళవారం కేంద్రం సూచించింది. అలాగే గణాంకాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని కేరళ ప్రభుత్వానికి వెల్లడించింది. 

క్రితంరోజు ఒకేఒక్క కరోనా మరణం నమోదుకాగా.. నిన్న 40 మంది మరణించారు. కేరళ ప్రకటించిన మృతుల సంఖ్యే 34గా ఉంది. ఇప్పటివరకూ 5.22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

ప్రస్తుతం రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా వస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,547 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు 12,340కి పెరిగాయి. మొత్తం కేసుల్లో రికవరీల వాటా 98.76 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు 0.03 శాతంగా కొనసాగుతోంది.

ఇక నిన్న 17,23,733 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకూ 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని