ICG: 11వేల మందిని కాపాడాం.. ₹11వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నాం: ఐసీజీ

దేశంలో డ్రగ్స్‌ని నిషేధించినా.. కొందరు స్మగ్లర్లు పలు దేశాల నుంచి ఓడల్లో అక్రమంగా డ్రగ్స్‌, నిషేధిత వస్తువులను భారత్‌కు దిగుమతి చేస్తున్నారు. అయితే, అలాంటి వారిని ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్ (ఐసీజీ) దళాలు నిఘా పెట్టి పట్టుకుంటున్నాయి. అలా గతేడాది రూ. 3,950కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం

Published : 01 Feb 2022 01:17 IST

దిల్లీ: దేశంలో డ్రగ్స్‌ని నిషేధించినా.. కొందరు స్మగ్లర్లు పలు దేశాల నుంచి ఓడల్లో అక్రమంగా డ్రగ్స్‌, నిషేధిత వస్తువులను భారత్‌కు దిగుమతి చేస్తున్నారు. అయితే, అలాంటి వారిని ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్ (ఐసీజీ) దళాలు నిఘా పెట్టి పట్టుకుంటున్నాయి. అలా గతేడాది రూ. 3,950కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఐసీజీ వెల్లడించింది. అలాగే, 2021లో సముద్రంలో చిక్కుకున్న 1,226 మందిని కాపాడి సురక్షితంగా ఒడ్డుకి చేర్చామని తెలిపింది. ఐసీజీ ప్రారంభమైననాటి నుంచి మొత్తం.. రూ.11,924 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకోగా.. 11,082 మంది ప్రాణాలను రక్షించినట్లు పేర్కొంది. అలాగే, అక్రమ రవాణాకు పాల్పడిన 13,354 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఇందుకోసం ఉపయోగించిన 1,568 పడవలను స్వాధీనం చేసుకున్నామని ఐసీజీ వివరించింది. 

మంగళవారం ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ దళాలు 46వ ‘రైజింగ్‌ డే’ని జరపుకోనున్నాయి. ఈ సందర్భంగా ఐసీజీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘1978లో ఈ దళం ప్రారంభమైనప్పుడు ఏడు ఉపరితల ప్లాట్‌ఫామ్స్‌ మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు ఒక బలమైన సైన్యంగా మారింది. ప్రస్తుతం ఐసీజీలో 158 ఓడలు, 70 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. 2025 నాటికి ఓడల సంఖ్య 200కి, ఎయిర్‌క్రాఫ్ట్స్‌ సంఖ్య 80కి చేరనుంది. కరోనా నేపథ్యంలో అనేక ఆంక్షలు విధించినా.. మా కోస్ట్‌ గార్డ్‌ బలగాలతో 24 గంటలూ భారత పరిధిలో ఉన్న ఎకానమిక్‌ జోన్‌పై నిఘా వేసి ఉంచాం. ఇందుకోసం ప్రతి రోజు 50 ఓడలు, 12 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను మోహరించాం. అంతేకాదు.. రాడర్లు, ఎలక్ట్రో-ఆప్టిక్‌ సెన్సార్ తదితర కోస్టల్‌ నిఘా నెట్‌వర్క్‌తో రేయింబవళ్లూ కాపు కాస్తున్నాం’’అని ఐసీజీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని