Jaishankar: ‘దౌత్యవేత్తలకు భద్రత కల్పించడంలో బ్రిటన్‌ విఫలం..!’

లండన్‌లోని భారత హైకమిషన్‌ వద్ద భద్రతా ప్రమాణాలను నిర్వహించడంలో బ్రిటన్‌ విఫలమైందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆరోపించారు. 

Published : 24 Mar 2023 23:31 IST

బెంగళూరు: ఇటీవల బ్రిటన్‌ రాజధాని లండన్‌లోని భారత హైకమిషన్‌ (Indian High Commission) వద్ద ఖలిస్థానీ (Khalistan) అనుకూల వ్యక్తులు పాల్పడిన దుశ్చర్యలను విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ (Jaishankar) తీవ్రంగా ఖండించారు. భద్రతా ప్రమాణాల విషయంలో తారతమ్యాలను భారత్ అంగీకరించదని స్పష్టం చేశారు. భారత దౌత్యవేత్తలకు భద్రత కల్పించే బాధ్యతను నెరవేర్చడంలో బ్రిటన్‌ (Britain) విఫలమైందని ఆరోపించారు. ‘ఏదైనా దేశం.. విదేశాలకు తమ దౌత్యవేత్తలను పంపినప్పుడు.. వారు తమ పని చేసుకునేందుకు వీలుగా భద్రతను కల్పించడం సంబంధిత దేశం బాధ్యత. కానీ, బ్రిటన్‌ ఈ బాధ్యతలను నెరవేర్చలేదు’ అని జైశంకర్‌ వ్యాఖ్యానించారు. బెంగళూరు (Bengaluru)లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

‘చాలా దేశాలు తమ సొంత భద్రత గురించి ఒక అభిప్రాయాన్ని, ఇతరుల భద్రత విషయానికొస్తే భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటాయి. కానీ, భారత్‌ ఇటువంటి భేదాలను అంగీకరించదు’ అని జైశంకర్‌ స్పష్టం చేశారు. బ్రిటన్‌ పర్యటనలో భాగంగా హక్కులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో జైశంకర్ స్పందిస్తూ.. ‘భారత పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నవారిలో చాలామందికి దేశంతో మంచి అనుబంధం ఉంది. కొద్దిమంది మాత్రమే.. వీసా లేదా నివాస హోదా పొందడం కోసం స్వదేశంలో వేధింపులకు గురవుతున్నట్లు చెప్పుకొంటారు. ఇదంతా రాజకీయాలు, హక్కుల పేరిట ఆడే  ‘వీసా గేమ్‌’’ అని పేర్కొన్నారు. హక్కులను కలిగి ఉండటం, వాటిని దుర్వినియోగం చేయడం మధ్య వ్యత్యాసం ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని