Varun Gandhi: ‘స్వాతంత్ర్యం’పై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు.. వరుణ్‌ గాంధీ ఫైర్‌!

‘భారత్‌కు అసలైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది. అంతకుముందు 1947లో మనకు లభించింది భిక్షం. ఆ విధంగా దొరికినదాన్ని స్వాతంత్ర్యంగా పరిగణిస్తామా?’ అంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది! బ్రిటీష్ పాలన, కాంగ్రెస్‌ను ఉద్దేశించి...

Published : 11 Nov 2021 14:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భారత్‌కు అసలైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది. అంతకుముందు 1947లో మనకు లభించింది భిక్షం. ఆ విధంగా దొరికినదాన్ని స్వాతంత్ర్యంగా పరిగణిస్తామా?’ అంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది! బ్రిటీష్ పాలన, కాంగ్రెస్‌ను ఉద్దేశించి.. ఓ జాతీయ ఛానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది! ఇదే క్రమంలో గురువారం భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంబంధిత వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసి.. ఇలాంటి ఆలోచనను ‘పిచ్చితనంగా భావించాలా.. లేదా దేశద్రోహంగానా’ అంటూ మండిపడ్డారు!

‘కొన్నిసార్లు మహాత్మాగాంధీ త్యాగాలు, దీక్షకు అవమానం.. మరికొన్నిసార్లు ఆయన హంతకుడికి గౌరవం. ఇప్పుడు మంగళ్‌పాండే మొదలు రాణి లక్ష్మీబాయి, భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌.. ఇలా లక్షలాది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పట్ల తిరస్కార ధోరణి. ఈ ఆలోచనను పిచ్చితనంగా పిలవాలా లేదా దేశద్రోహంగానా?’ అని రాసుకొచ్చారు. గతంలోనూ ఓసారి నాథురాం గాడ్సేను కీర్తించిన వారిపై వరుణ్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కంగనా రనౌత్‌ ఇటీవలే పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని