Altaf Shah: కశ్మీరీ వేర్పాటువాదనేత అల్తాఫ్‌ షా మృతి

కశ్మీరీ వేర్పాటువాదనేత అల్తాఫ్‌ షా నేడు దిల్లీ ఎయిమ్స్‌లో మృతి చెందారు. ఉగ్రవాదానికి నిధులు సమీకరించిన కేసులో అరెస్టై ఆయన గత ఐదేళ్లుగా తిహాడ్‌ జైల్లో ఉంటున్నారు.

Published : 11 Oct 2022 23:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కశ్మీరీ వేర్పాటువాదనేత అల్తాఫ్‌ షా నేడు దిల్లీ ఎయిమ్స్‌లో మృతి చెందారు. ఉగ్రవాదానికి నిధులు సమీకరించిన కేసులో అరెస్టై ఆయన గత ఐదేళ్లుగా తిహాడ్‌ జైల్లో ఉంటున్నారు. మూత్రపిండాల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన్ను కొన్నాళ్ల క్రితం రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు తరలించారు. షా మృతి విషయాన్ని ఆయన కుమార్తె రువాషా కూడా ట్విటర్‌లో ధ్రువీకరించారు. 

కోర్టు జోక్యం చేసుకొనే వరకు అల్తాఫ్‌కు సరైన వైద్యం అందించలేదని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొన్నాళ్లుగా రువాషా తండ్రి ఆరోగ్యంపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. షాను విడుదల చేయాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాను ఆమె అభ్యర్థించారు. ఈ నెల 3వ తేదీన దిల్లీ హైకోర్టు  అల్తాఫ్‌ షా అనారోగ్యాన్ని గుర్తించి.. ఆయన్ను వైద్యం కోసం దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని ఆదేశించింది. 

అల్తాఫ్‌ షా ప్రముఖ కశ్మీర్‌ వేర్పాటు వాద నేత సయ్యద్‌ అలీషా గిలానీకి అల్లుడు. గిలానీ గతేడాది సెప్టెంబర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఉగ్రనిధులపై జాతీయ దర్యాప్తు సంస్థ గతంలో చేపట్టిన దాడుల్లో అరెస్టు చేసింది. గత రెండేళ్లలో జైల్లోనే మరణించిన కశ్మీరీ వేర్పాటువాద నేతల్లో షా మూడో వ్యక్తి. గతేడాది మే నెలలో వేర్పాటువాద నేత మహమ్మద్‌ అష్రఫ్‌ ఖాన్‌ అలియాస్‌ సెహ్రాయి కూడా ఖైదీగా ఉంటూనే జమ్ములోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని